×
Ad

ఫ్యామిలీలో కుంపట్లు.. విడదల రజినికు చిక్కులు..సవాళ్లు.!

  • Publish Date - November 12, 2025 / 02:17 PM IST

గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజిని, చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్లను కాదని మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమె నియోజకవర్గం మారడంతో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు వచ్చినా, అప్పటి నుంచి ఆమెకు అన్ని సవాళ్లే ఎదురవుతున్నాయి.

ప్రస్తుతం చిలకలూరిపేట ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి విడదల రజినిని రేపల్లెకు మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.  రజినిపై క్యాడర్‌లో అసంతృప్తి ఎక్కువగా ఉందని, వరుస వివాదాల నేపథ్యంలో ఆమెను చిలకలూరిపేట నుంచి రేపల్లెకు మారుస్తారంటూ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రేపల్లె ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఈవూరు గణేష్ ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో రజినిని రేపల్లెకు మార్చి, చిలకలూరిపేటకు కొత్తవారిని తీసుకొస్తారని టాక్.

పొన్నూరులో కూడా సరైన ఇన్‌ఛార్జ్‌ లేరన్న వాదన వినిపిస్తోంది. దీంతో విడదల రజినిని అక్కడికి మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇన్‌ఛార్జ్‌ను మార్చాలని కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. దీంతో రజినిని మరొక నియోజకవర్గానికి పంపుతారా, లేక చిలకలూరిపేటకే పరిమితం చేస్తారా అనేది వేచి చూడాలి.