పాకిస్థాన్, బంగ్లాదేశ్ బంధం రోజురోజుకూ బలపడుతోంది. పాకిస్తాన్ ఇస్తున్న ఆఫర్లకు బంగ్లాదేశ్ సరే అంటోంది. తాజాగా, ఢాకాలో పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కేంద్రం ఏర్పాటుకు బంగ్లా అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
పాక్ హై కమిషన్‌లో ఏర్పాటు చేయబోయే ఐఎస్‌ఐ సెల్‌లో ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి, ఇద్దరు కల్నల్స్, నలుగురు మేజర్లు ఉంటారని సమాచారం. భారత్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పాకిస్తాన్ ఈ కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోంది.
ఆపద్ధర్మ నాయకుడిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు దగ్గరవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని బంగ్లాదేశ్‌ను పావుగా వాడుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్‌లోని భారత వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇచ్చి, ఇండియాపైకి ఎగదోసేందుకు దాయాది కుట్ర పన్నినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రక్షణ రంగంలో ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా బంగ్లా భద్రతా దళాలకు పాక్ సైన్యం శిక్షణ ఇచ్చే విధంగా డీల్ జరిగింది. బంగ్లాదేశ్‌కు సాయం అందిస్తూ, పావులా వాడుతూ భారత్‌కు పక్కలో బల్లెంలా తయారు చేస్తోంది పాకిస్తాన్.