Cup Of Chai
Cup Of Chai : రోజును ప్రారంభించబోతున్నా, మధ్యాహ్నం పని సమయాలకు మధ్యలో , నిద్రపోయే ముందు ప్రశాంతమైన పానీయం తాగాలనుకున్నా, రోజులో ఏ సమయంలోనైనా ఒక కప్పు చాయ్ మంచిది. చాయ్ అనేది మనస్సును శక్తివంతం చేసే రిఫ్రెష్ పానీయం. చాయ్ అంటే టీ మాత్రమే కాదు, ఇది పాశ్చాత్య మరియు ఆసియా దేశాలలో బాగా ప్రాచుర్యం పొందిన సున్నితమైన సుగంధ ద్రవ్యాలతో కూడిన ఒక ఆహ్లాదకరమైన పానీయం. ప్రత్యేకమైన రుచిని అందించే మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమం తో కూడిన ఛాయ్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.
చాయ్‌లో చాలా రకాలు ఉన్నాయి. చాయ్‌లో ఉపయోగించే టీ పొడితోపాటుగా సుగంధ ద్రవ్యాలైన అల్లం, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, సోపు గింజలు, ఏలకులు. చాయ్ రుచిని మరింత సున్నితంగా చేయడానికి తోడ్పడతాయి. ఇందులోని పాలు మరియు పాల ప్రత్యామ్నాయాలు రుచిగా ఆరోగ్యకరంగా మారుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నా, లేదా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచాలనుకున్నా, చాయ్ సరైన ఎంపిక. ఇల్లు, ఆఫీస్ పని మధ్యలో బాగా అలసినట్లు అనిపిస్తే వేడివేడిగా తాగే కప్పు ఛాయ్ శరీరాన్ని తిరిగి శక్తిమంతం చేస్తుంది. కప్పు ఛాయ్ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
టీ అలవాటున్న వారిలో ఎక్కువశాతం మంది అనారోగ్యాల బారిన పడకుండా ఉన్నట్లు ఆమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎండిన, హెర్బల్ లేదా అనాక్సిడైజ్డ్ ఆకుల నుంచి తయారుచేసే గ్రీన్ టీ లలో యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించే పాలీఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తీసుకునే ఓ కప్పు టీవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మానసికారోగ్యం పెంపొందుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జీవక్రియలు సక్రమంగా జరిగి, బరువును పెరగనివ్వవు. కాలేయ పనితీరు బాగుంటుంది. టైప్2 మధుమేహం దరికి చేరదు.
ఫ్రీరాడికల్స్, బీటా అమిలాయిడ్ పెప్టైడ్స్ బారి నుంచి మెదడు కణాలను కాపాడే గుణాలు టీ లో మెండు. ఇవి మెదడును నిత్యం చురుకుగా ఉండేలా చేసి మతిమరపును దూరం చేస్తాయి. ఒత్తిడి, ఆందోళనగా అనిపించినప్పుడు ఓ కప్పు టీతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలతో తయారైన ఛాయ్ తో సాధారణ నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక నొప్పి ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది.