చైనాలో విజృంభించిన coronavirus ఇప్పుడు హైదరాబాద్ ను కూడా వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు హైదరాబాదీలకు ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వీరికి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి రిపోర్టు వస్తే తప్ప వ్యాధిని నిర్ధారించలేమని డాక్టర్లు చెపుతున్నారు.
మరోవైపు ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య బృందం సోమవారం(జనవరి 27,2020) ఫీవర్ ఆస్పత్రికి వచ్చి అనుమానితులను పరీక్షించనుంది. coronavirus పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ అన్నారు. అనుమానితులు ముగ్గురికి వైద్యం అందిస్తున్నామని వివరించారు.
మొత్తం నలుగురు అనుమానితులు ఫీవర్ ఆస్పత్రికి వచ్చారని, వారిలో ఒకరికి పరీక్షలు చేయగా అతనికి corona లేదని తేలిందన్నారు. మరో ముగ్గురు చైనా నుంచి వచ్చి అనుమానంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారని, వారికి కూడా రక్త పరీక్షలు నిర్వహిస్తూ పరిశీలిస్తున్నామని డాక్టర్ శంకర్ చెప్పారు.
స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్ లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ….చైనా నుంచి వచ్చిన వాళ్లకు జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, గొంతు నొప్పి ఉండి ఉంటే వారు తప్పని సరిగా డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ చైనా, హాంకాంగ్, వియత్నాం నుంచి వచ్చే వారిని పరీక్షిస్తున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోంటామని ఆయన వెల్లడించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా తక్షణమే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.