Almond Oil : పొడిబారిన చర్మానికి, పగిలిన మడమలకు సహజసిద్ధమైన సన్‌స్క్రీన్‌ బాదం నూనె !

దెబ్బతిన్న జుట్టును సరిచేయడం, చిట్లిన జుట్టు సమస్యను నివారించటం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటానికి బాదం నూనె ఉపయోగపడుతుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని సహజ రంగులోకి తీసుకొస్తుంది.

almond oil

Almond Oil : బాదం నూనెను శతాబ్దాలుగా చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగిస్తున్నారు. బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇతర పోషకాల నుండి చర్మానికి, జుట్టుకు అనేక ప్రయోజనాలు అందుతాయి. బాదం నూనెలో రెండు రకాలు ఉన్నాయి. చేదు బాదం మరియు తీపి బాదం. ప్రతి రకం విభిన్న లక్షణాలను కలిగి ఉంటుంది మరియు వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు.

చేదు బాదం నూనె ఘాటైన వాసన కలిగి ఉంటుంది. దీనిని సబ్బులు, అరోమాథెరపీ, మసాజ్ థెరపీలలో ఉపయోగిస్తారు. ఇది మీ చర్మంపై ఉపయోగించడం సురక్షితమైనది.అయితే దీనిని నోటి ద్వారా తీసుకోవటం విషపూరితం కావచ్చు. ఇక తీపి బాదం నూనె తీపి బాదం నుండి వస్తుంది. ఇది సాధారణంగా అనేక చర్మ సంరక్షణ మరియు జుట్టు ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

ఆల్మండ్ ఆయిల్ ఉపయోగాలు ;

బాదం నూనె యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కొంతమంది స్మూతీస్‌లో బాదం నూనెను కలుపుకుంటారు. మరికొందరు తమ రోజువారీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటం కోసం వాడుతుంటారు. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో లభిస్తుంది. అనేక సౌందర్య,జుట్టు సంరక్షణ ఉత్పత్తులైన సబ్బులు, లోషన్లు, లిప్ బామ్స్, షాంపూలు మరియు కండిషనర్లు, బాడీ వాష్, బ్రైటెనింగ్ సీరమ్స్ లలో బాదం నూనెను ఉపయోగిస్తున్నారు.

దెబ్బతిన్న జుట్టును సరిచేయడం, చిట్లిన జుట్టు సమస్యను నివారించటం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటానికి బాదం నూనె ఉపయోగపడుతుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని సహజ రంగులోకి తీసుకొస్తుంది. బాదం నూనె సహజసిద్ధమైన సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. పొడిబారి గరుకుగా మారిన చర్మానికి, పగిలిన మడమలకు ఈ నూనెను పట్టించి బాగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్‌ ‘ఇ’, మోనోశ్యాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు, పొటాషియం, జింక్ వంటి పోషకాలు అందాన్ని మెరుగుపరుస్తాయి. వృద్ధాప్య ఛాయలు నివారిస్తాయి.

బాదం నూనె సాధారణంగా సున్నితమైన చర్మానికి సురక్షితం. ఎందుకంటే ఇది చర్మానికి చికాకు కలిగించదు. దీర్ఘకాలిక చర్మ పరిస్థితులను నిర్వహించడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేస్తే కళ్ల కింద నల్లని వలయాలు తొలగిపోతాయి. దుమ్ము, ధూళి వంటివాటి వల్ల చర్మం నిర్జీవంగా మారితే రెండు చెంచాల పెసరపిండిలో బాదం నూనె కలుపుకొని పేస్ట్‌లా చేసుకుని చర్మానికి అప్లై చేసుకోవాలి. తరువాత చల్లని నీటితో కడుక్కోవటం వల్ల చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా మారుతుంది.