Hair
Hair Loss: జుట్టు రాలడం అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య. జుట్టు రాలిపోయి చిన్నవయసులో బట్టతల రావడంతో పెళ్లిళ్లకు ఇబ్బంది పడడం.. మానసికంగా ఆందోళనకు గురవ్వడం జరుగుతోంది. అందుకే చాలామంది జుట్టు రాలిపోకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. బట్టతల రావడానికి కారణం ఏంటీ? జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి..? బట్టతల సమస్యకు చెక్ పెట్టడం ఎలా? తెలుసుకుందాం..
జుట్టు రాలడానికి కారణం ఏంటీ?
జుట్టుకు సంబంధించిన వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతిరోజూ 100 వెంట్రుకలు కంటే తక్కువ కోల్పోతుంటే, భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాత జుట్టు రాలినప్పుడు, కొత్త జుట్టు వస్తుంది. కానీ మీ జుట్టు చాలా వేగంగా రాలిపోతుంటే మాత్రం, ఈ సమస్యను సీరియస్‌గా తీసుకొని వెంటనే డాక్టర్‌తో మాట్లాడండి. అలోపేసియా అరేటా అనే వ్యాధి అయ్యి ఉండవచ్చు. ఈ వ్యాధిలో ఊహించని విధంగా జుట్టు రాలుతుంది. కొన్నిసార్లు తలలో ఒక ప్రత్యేక ప్రదేశం నుండి జుట్టు రాలడం జరుగుతుంది.
మానవ జన్యువుల్లోని జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కారణంగా బట్టతల వస్తుంది. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహార లోపం కారణంగా కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఇక మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా.. మహిళల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి?
పోషకాహారం లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను అలవరచుకుంటే మంచిది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుని, కంటినిండా నిద్రపోతూ, తగినంత వ్యాయామం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటూ.. బయటకు వెళ్లినప్పుడు, పొల్యూషన్‌లో తిరిగినప్పుడు తలకు క్యాప్ పెట్టుకుంటే, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
రెగ్యులర్‌గా షాంపూతో తలస్నానం చేస్తే కూడా జుట్టుకు మంచిదే. మగవారైతే రోజు విడిచి రోజు, మహిళలైతే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి. తల జిడ్డుగా తయారవుతుందని చాలామంది నూనె పెట్టుకోరు. కానీ జుట్టుకు తేమ అందడం చాలా ముఖ్యం. కాబట్టి తలస్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మసాజ్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.