Sitting For Long Hours : ఎక్కువ పనిగంటలు కూర్చొనే ఉంటున్నారా? తస్మాత్ జాగ్రత్త! గుండెపోటు, రక్తపోటు వచ్చే ఛాన్స్

వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువ సమయం కూర్చోకుండా జాగ్రత్తపడాలి. దీని వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. కూర్చోని ఉండటం వల్ల తక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

sitting for long hours

Sitting For Long Hours : మీరు ఎక్కువ సమయం మేల్కొని కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఐదు లేదా అంతకంటే తక్కువ గంటలు కూర్చునే వారి కంటే రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చునే వారికి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. కూర్చోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు , ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సిరలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా బోలు ఎముకల వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, ఎటుకదలకుండా నిశ్చలంగా కూర్చొని ఉండే జీవనశైలి సమస్యలను మరింత రెట్టింపు చేస్తుంది. కంప్యూటర్ ముందు కూర్చుని గంటలతరబడి పనిచేయటం, గంటలకొద్దీ కూర్చొనే ఉండటం వంటివి దీర్ఘకాలంలో ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం, ఊబకాయం వల్ల ఎలాంటి ప్రాణాంతకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో రోజుకు 8 గంటల పాటు కూర్చోవడం వల్ల కూడా అలాంటి అనారోగ్య సమస్యలే తలెత్తుతాయి.

వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువ సమయం కూర్చోకుండా జాగ్రత్తపడాలి. దీని వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. కూర్చోని ఉండటం వల్ల తక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీంతో ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్ద ప్రేగు క్యాన్సర్లతో సహా మరికొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కండరాలు కుచించుకుపోయి జాయింట్ పెయిన్స్ వస్తాయి. కూర్చొని పనులు చేసేవారు 30 నిమిషాలకొకసారి 5నిమిషాలపాటు అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.

రోజువారీ కూర్చున్న గంటల ఆధారంగా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎలా లెక్కించాలి:

రోజుకు 4 గంటల కంటే తక్కువ సమయం కూర్చుని ఉండే వారిలో గుండె పోటు ప్రమాదం తక్కువగా ఉంటుంది. రోజుకు 4-8 గంటలు కూర్చుని ఉండే వారిలో మితమైన ప్రమాదం ఉంటుంది. రోజుకు 8-11 గంటలు కూర్చుని ఉండే వారిలో అధిక ప్రమాదం ఉంటుంది. రోజుకు 11 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారిలో గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.