Desk Yoga Stretches
సాధారణంగా యోగా చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. మ్యాట్‌లు, ప్రశాంతమైన వాతావరణం ఇలా చాలా సెట్ చేసుకుంటారు. చాలా మంది ఇదే ఆలోచనలో ఉంటారు. దీనివల్ల ఆఫీస్ వర్క్స్ తో బిజీగా ఉండేవాళ్ళు యోగా కోసం టైం కేటాయించలేకపోతారు. అలాంటి వారు ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూనే యోగా చేయొచ్చు. దానివల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. అదే డెస్క్ యోగా. ఈ డెస్క్ యోగా మన రోజువారీ ఆఫీసు పని చేసుకుంటూనే సులభంగా చేసుకోవచ్చు. మరి మరి ఆ డెస్క్ యోగా ఏంటి? డెస్క్ దగ్గర ఎలాంటి యోగాసనాలు చెయ్యొచ్చు? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పరివృత్త సుఖాసనం: కుర్చీలో నిటారుగా, సౌకర్యవంతంగా కూర్చొని ఎడమ చేతిని కుడి మోకాలిపై ఉంచి శరీరం పైభాగాన్ని కుడి వైపుకు తిప్పుతూ.. కుడి చేతితో కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోవాలి. ఛాతీని ముందుకు ఉంచుతూ వెన్నెముకను నిటారుగా సాగదీయాలి. శ్వాస లోతుగా తీసుకుంటూ 5 నుంచి 8 సెకన్ల పాటు అలాగే ఉండాలి. ఇలా రెండు ప్రక్కలా 5 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముకపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. గుండె, ఊపిరితిత్తుల వైపు శక్తి ప్రవాహం పెరుగుతుంది. శరీరాన్ని సవ్యదిశకు తెచ్చి విశ్రాంతిని ఇస్తుంది.
గ్రీవ సంచాలన క్రియ: మీరు డెస్క్ వద్ద కూర్చుని, వీపును నిటారుగా ఉంచి మెడను నెమ్మదిగా సవ్యదిశలో తుప్పుతూ ఉండాలి. అలా మెడ పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకుంటూ క్రిందకు వచ్చేటప్పుడు శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా 5 నుంచి8 సార్లు చేయాలి. తర్వాత అదేవిధంగా అపసవ్యదిశలో చేయాలి. ఈ ఆసనం వల్ల మెడ, భుజాలపై పడే ఒత్తిడి తగ్గుతుంది. మైండ్ అంత రిలీఫ్ గా మారుతుంది. నెగిటీవ్ ఆలోచనలు దూరం అవుతాయి.
తాడాసనం: మీరు ఆఫీస్ లో డెస్క్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి నిలబడండి. లేచి చేతి వేళ్ళను ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి. అలా కలిపిన చేతులను తల పైనకు తీసుకువచ్చి పూర్తిగా పైకి చాచాలి. ఇప్పుడు మీ శరీర బరువు మొత్తం కాలివేళ్లపై ఉంచాలి. ఇలా కనీసం 5 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరమంతా రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. కండర వ్యవస్థ శక్తివంతంగా మారుతుంది. బలహీనత తగ్గుతుంది.
నాసికాగ్రహ దృష్టి: కుర్చీలో సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని కనురెప్పలు వాల్చకుండా తేదేకంగా ముక్కు చివరను ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూస్తూ ఉండాలి. అలా కాసేపు చేసిన తరువాత కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక స్పష్టత, స్థిరత్వం, ఏకాగ్రత పెరుగుతుంది. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.