బెంగళూరు వ్యక్తికి కరోనా పాజిటివ్

బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. పరీక్షలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడానే ఉందని సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి భార్య,కుమారుడిని క్వారంటైన్(దిగ్భందించడం)చేసినట్లు తెలిపారు.

మార్చి-1,2020న బాధిత వ్యక్తి అమెరికా నుంచి బెంగళూరుకి తిరిగి వచ్చారని,మార్చి-5,2020న ఆయనలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని,దీంతో వెంటనే ఆయనను హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడని,పరీక్షల్లో ఇప్పుడు ఆయనకు కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని మంత్రి సుధాకర్ తెలిపారు. బాధిత వ్యక్తితో ప్రయాణించిన కొలీగ్(సహోద్యోగి)ను కూడా క్వారంటైన్ చేసినట్లు మంత్రి తెలిపారు.

అమెరికా వ్యాప్తంగా మొత్తం 564మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. అయితే ఈ 564మందిలో ఇప్పటివరకు 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువగా వాషింగ్టన్ రాష్ట్రంలో 18మంది కరోనా సోకి మరణించారు. కాలిఫోర్నియాలో ఒకరు,ఫ్లోరిడాలో ఇద్దరు కరోనా సోకి మరణించారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 1లక్షా 11వేలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా 3వేల892మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ తో కూడా కలిపి 103దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43కి చేరింది.