తెలంగాణలో 14కు కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్టు రాష్ట్ర సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా సోకిందన్నారు. వేరే రాష్ట్రాల్లో విమానం దిగి మన రాష్ట్రానికి రైళ్లలో వస్తున్నారని చెప్పారు. కరీంనగర్‌కు వచ్చిన వాళ్లు కూడా రైల్లోనే వచ్చారని తెలిపారు. కరోనా వ్యాప్తిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వాళ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించామన్నారు.
స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి :
విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని దేశాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో ఆ ఇబ్బందులు రాకూడదని ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అనుమానితులు ఎవరూ కనిపించినా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. మార్చి 31 వరకు మాల్స్, పార్క్ లు మూసే ఉంటాయని, దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు, గురుద్వారాల్లో భక్తులను అనుమతించవద్దని కోరామన్నారు. ఎక్కువ మంది గుమికూడకపోవడమే కరోనాకు మంచి మందు అన్నారు. ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఉత్సవాలు రద్దు.. లైవ్‌లోనే పంచాగ శ్రవణం :
మార్చి 25న ఉగాది పంచాగ శ్రవణాన్ని లైవ్ టెలీకాస్ట్ చేస్తామని తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేశామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో శానిటైజేషన్ ఎక్కువగా చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యాన్ని పెంచాలని ఆదేశించామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లను హోం క్వారంటైన్ చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్న వాళ్లు ఎవరైనా ఇళ్లకు వెళ్తామంటే పంపిస్తామన్నారు. విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్లను క్వారంటైన్ చేయాల్సిందేనని కేసీఆర్ చెప్పారు.
ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యశాఖకు సమాచారం అందించమని అధికారులకు చెప్పామన్నారు. చెక్ పోస్టుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తారని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు. 5 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రిపేరై ఉన్నారని, పరీక్షా కేంద్రాలను ప్రతీ రోజు శానిటైజ్ చేస్తారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యవసర దుకాణాలు తెరిచే ఉంచుతామన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
14మందికి మాత్రమే కరోనా పాజిటీవ్ :
జన సమ్మర్థం ఉన్నచోటకు వెళ్లకండని సూచించారు. కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా సమావేశం ఏర్పాటు చేశామని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకూ 14 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛంధంగా వైద్య పరీక్షలు చేయించుకుంటే కరోనా విస్తరించకుండా నిరోధించే అవకాశం ఉందని తెలిపారు. మార్చి 31 వరకు థియేటర్లు, పబ్స్, విద్యాసంస్థలు, మాల్స్ మూసివేయాలని ఆదేశించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.
గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో శానిటేషన్ పనులు పెంచాలని తెలిపారు. 1135 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టడం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిరోజు రాష్ట్రానికి 84 రైళ్లు వస్తూ పోతూ ఉంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని కేసీఆర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను చెక్ చేస్తామన్నారు. తెలంగాణలో నివసిస్తున్న ఏ వ్యక్తికి కరోనా లక్షణాలు లేవన్నారు. 10వ తరగతి పరీక్షలు యథావిథిగా జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.