భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 వేల 192 మందికి నయం కావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు.
మహారాష్ట్రలో 6 వేల 817 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 301 మంది కరోనా బాధితులు మృతి చెందారు. గుజరాత్ లో 2 వేల 815 కేసులు నమోదు కాగా, 127 మంది మృతి చెందారు. రాజస్థాన్ లో 2 వేల 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 27 మంది మరణించారు. తమిళనాడులో 1755 కరోనా కేసులు నమోదు కాగా, వీటిలో 31 చిన్నారులు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 22 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. 29 మంది మృతి చెందారు.
ఓవైపు లాక్ డౌన్, మరోవైపు మండు టెండలు.. వీటి కారణంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గు ముఖం పట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం రోజువారిగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఒకింత స్థిరంగా ఉంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అవి తగ్గే అవకాశం ఉంది. అయితే రిలాక్స్ అవడానికి లేదు. ముందు ముందు మరింత ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా.. భారత్ లో రెండోసారి కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. వానాకాలంలో మరోసారి కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కొన్నివారాల వరకు పరిస్థితి అదుపులోనే ఉంటుందని.. జూలై చివర్లో లేదా ఆగస్టులో వైరస్ మళ్లీ పడగ విప్పే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలు, వాతావరణం చల్లబడటం దీనికి కలిసివస్తుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని శివనాడార్ యూనివర్సిటీ, బెంగళూరులోని ఐఐఎస్‌సీ, టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన పరిశోధకులు చైనా, ఇటలీ తదితర దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి ఉచ్ఛ స్థితిని దాటి ప్రస్తుతం ఒకేస్థాయిలో కొనసాగుతున్నదని శివనాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సమిత్ భట్టాచార్య పేర్కొన్నారు.
లాక్‌డౌన్ విధించే నాటికి దేశంలో 618 కేసులు, 13 మరణాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు కేసుల సంఖ్య 23వేలు, మరణాల సంఖ్య 700 దాటిందని, కేసుల రెట్టింపు వేగం తగ్గిందని, కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుందని గుర్తుచేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని, మే 3న లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత సైతం కొన్ని రోజులు కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు.