కరోనా ఎఫెక్ట్ : బాలీవుడ్ సినిమాలు ఆడేది లేదు.. విమానాలు ఎక్కేది లేదు

  • Publish Date - February 7, 2020 / 02:25 AM IST

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలోని వుహాన్ సిటీలో వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. డ్రాగన్ దేశానికి వాణిజ్య కేంద్రమైన వుహాన్ నుంచి ప్రపంచ దేశాలకు ఎన్నో ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. కరోనా వైరస్ దెబ్బకు వ్యాపార వ్యవహారాలన్నీ కుంటపడ్డాయి.

వైరస్ భయం.. చైనాలో స్టాక్ మార్కెట్లను కూలదూసింది. ఫలితంగా డ్రాగన్ దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క చైనాలో మాత్రమే కాకుండా వాణిజ్యపరంగా సంబంధాలున్న ఇతర దేశాల పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రత్యేకించి భారత్ లోని కొన్ని పరిశ్రమలపై కరోనా ప్రభావం గట్టిగానే పడినట్టు కనిపిస్తోంది. చైనాలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా.. 2019 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు దిగుమతుల్లో అత్యధిక వాటా 14శాతం కలిగి ఉంది. 

దేశీయ వస్తువులకు మూడో అతిపెద్ద మార్కెట్ గా పేరొందిన చైనా.. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5 శాతం వాటా కలిగి ఉంది. ఈ అంతరాయం ఇలానే సుదీర్ఘంగా కొనసాగుతూ పోతే.. చైనా నుంచి భారత్‌కు దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. దేశీయ ఆర్థిక కార్యకలాపాలకు ఇదెంతో కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నుంచి భారత్ కు దిగుమతులకు సవాల్ గా మారనున్నట్టు ఇటీవల క్రెడిట్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ రిపోర్టులో తెలిపింది.

చైనాలో ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో ఆ ప్రభావం భారత్ నుంచి ఎగుమతులపై ప్రభావం పడుతోంది. ఇండియాలో ఇప్పటివరకూ మూడు కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ధ్రవీకరించారు. అదే చైనాలో అయితే అధికారికంగా 563 మంది మృతిచెందారు. గతంలో ఎన్నడూలేనంతగా చైనా స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న ఇండియాలోని దేశీయ పరిశ్రమలపై ఏ మేరకు ప్రభావం పడుతుందో ఓసారి చూద్దాం.. 

పర్యాటక రంగం : 
2019లో భారత్ లో మొత్తం ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ (FTA) 10.9 మిలియన్లుగా నమోదైంది. చైనా నుంచి వచ్చిన పర్యాటకులతో 3.12శాతంగా రికార్డు అయింది. గడిచిన కొన్ని ఏళ్లుగా చైనా నుంచి వచ్చే పర్యాటకులతో FTA షేర్ పెరిగిపోతోంది. కానీ, కరోనావైరస్ ప్రభావంతో భారత టూరిజం 2020లో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొవాల్సి వస్తోందని కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. 

వైమానిక రంగం (ఏవియేషన్) :
కరోనా ప్రభావంతో అత్యధికం ప్రభావం పడింది భారత వైమానిక రంగంపైనే. ఈ వైరస్ భయం కారణంగా దేశీయ విమాన సర్వీసులను బలవంతంగా రద్దు చేశారు. ఇండియా నుంచి చైనా, హాంగ్ కాంగ్ నడిచే విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అందులో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్కువగా చైనాకు విమాన సర్వీసులను నిర్వహిస్తుంటాయి. 

బాలీవుడ్ ఇండస్ట్రీ : 
రిపోర్టు ప్రకారం.. ఈ కరోనా వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు 70వేల థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని ఏళ్లుగా ఎన్నో బాలీవుడ్ మూవీలు చైనాలో విడుదల అవుతున్నాయి. దంగల్, 3 ఇడియట్స్ వంటి మూవీలు చైనాలో బాక్సు ఆఫీసు దగ్గర కలెక్షన్లు కురిపించాయి. దీంతో అక్కడి దేశంలో బాలీవుడ్ మూవీలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు, ఎన్నో బాలీవుడ్ మూవీలు చైనాలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. కానీ, చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో బాలీవుడ్ మూవీలపై తీవ్ర ప్రభావం పడింది.