చాప కింద నీరులా కరోనా…భారత్ లో ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు

మన దేశంలో కూడా చాపకింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 223కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం(మార్చి-20,2020)ఒక్కరోజే 50కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ లో రెండు వారాల క్రితం వైరస్ కేసు మొదటగా నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఒక్క రోజులో 50కరోనా కేసులు నమోదవడంతో దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో ఇప్పటివరకు వైరస్ సోకి నలుగురు మరణించిన విషయం తెలిసిందే.

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు ప్రారంభమయ్యాయని ఇవాళ కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ మీడియా సమావేశం ద్వారా తెలిపింది. ఇళ్లు,పరిసరాలను అందరూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వైద్యులు,అత్యవసర సేవల్లో పనిచేసేవారిని ప్రోత్సహించాలన్నారు. కరోనా గురించి ఎవరికైనా అనుమానాలు,సందేహాలు ఉంటే 1075కి ఫోన్ చేసి అన్ని రకాల మిస్ ఇన్ఫర్మేషన్ ను క్లియర్ చేసుకోవాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఆదివారం ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు.

గురువారం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో… దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలి. ఆదివారం (మార్చి-22,2020)దేశప్రజలెవరూ ఇళ్లల్లోనుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఉదయం 7 గంటలనుంచి  రాత్రం 9గంటల వరకు దీన్ని పాటిద్దాం అని మోడీ పిలుపునిచ్చారు. ఆ రోజు 5 సాయంత్రం గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి,  కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేయాలని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కూడా కేంద్రం గురువారం ప్రకటించింది. అంతేకాకుండా వారం రోజులు అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని కేంద్రం సూచించింది. కరోనా వైరస్ దృష్ట్యా 10సంవత్సరాల లోపు చిన్నారులు, 65ఏళ్లు దాటిన పెద్దలు అందరూ ఇళ్లు వదిలి రావొద్దని కేంద్రప్రభుత్వం సూచించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది.అయితే భారత్ లో ఇప్పటివరకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకడం)లేదని కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది.