కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. చైనా బయటి దేశాల్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేస్తోంది. హుబేయ్ ప్రావిన్స్ లో మహమ్మారి విజృంభించడంతో ఒక రోజులోనే మృతుల సంఖ్య 103కి చేరింది. ఆదివారం 91 మృతుల సంఖ్య ఉండగా, సోమవారం నాటికి వంద దాటేసింది.
కానీ, గతరోజుతో పోలిస్తే 2,097 వరకు కొత్త వైరస్ కేసులు తగ్గాయి. అంతకుముందు రోజు 2,618గా నమోదయ్యాయి. కొత్త కరోనా కేసులు తగ్గడం ఇది తొలిసారి కాదు.. హుబేయిలో ఫిబ్రవరి 7న 2,841 కేసులు నమోదు కాగా, మరుసటి రోజున 2,147 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. WHO, చైనీస్ వైద్యాధికారుల ప్రకారం.. చైనాలో ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసులు 42వేలుగా అధికారులు ధ్రువీకరించారు.
24 ఇతర దేశాల్లో మొత్తంగా 319 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. మరోవైపు.. డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న 3,700 మంది ప్రయాణికులు, సిబ్బందిని జపాన్ లోని యోకోహ్మా పోర్టులో నిర్బంధించారు. ఓడలో ప్రయాణిస్తున్నవారిలో 65 కరోనా కేసులు నమోదయ్యాయి.
కార్నివల్ కార్పొరేషన్ (CCL.N) నుంచి ఇప్పటివరకూ మొత్తంగా కరోనా కేసులు 135కు చేరినట్టు ధ్రువీకరించింది. కరోనా కేసులను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు టెస్టులు, చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 168 ల్యాబ్స్‌కు వైరస్ గుర్తించేందుకు టెక్నాలజీ అందుబాటులో ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 1018కి చేరింది. 43,100 కేసులు నమోదు కాగా, వైరస్ సోకిన 7345 మందికి సీరియస్ గా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. చైనాలో ఇప్పటివరకూ 1,016 మంది మృతిచెందగా, 42,638 కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 28 దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. చైనాలో సోమవారం ఒక్కరోజే 108 మంది మృతిచెందినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.