ప్రపంచవ్యాప్తంగా వందలాది మనుషుల ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇప్పుడు రూట్ మార్చింది. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని ఇప్పటివరకూ అనుకున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్ తిరిగి జంతువుల్లోనూ వ్యాపిస్తోంది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలోనే వైరస్ రూట్ మారింది. తొలిసారి పెంపుడు కుక్కలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. హాంగ్ కాంగ్‌లో పెంపుడు కుక్కకు కరోనా వైరస్ సోకింది. అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించింది.
కుక్కలో తక్కువ స్థాయిలో వైరస్ (పాజిటీవ్) లక్షణాలు ఉన్నట్టు సిటీ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ డిపార్టమెంట్ తెలిపింది. నిజంగా కుక్కకు కరోనా వైరస్ సోకిందా? లేదా అనేది ధ్రువీకరించేందుకు అక్కడి అధికారులు తదుపరి పరీక్షలు నిర్వహించనున్నారు. వాతావరణ మార్పుల్లో కారణంగా గాలిలో ఈ వైరస్ నోటి లేదా ముక్కు ద్వారా వ్యాపించే అవకాశం ఉంది. కరోనా వైరస్ వీక్ పాజిటీవ్ లక్షణాలు ఉండటంతో కుక్కను జంతువుల ప్రత్యేక వైద్యకేంద్రానికి తరలించి పర్యవేక్షిస్తున్నారు. పెంపుడు జంతువుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు భావిస్తే వాటిన్నింటిని ప్రత్యేకంగా నిర్బంధంలో ఉంచుతామని హాంగ్ కాంగ్ ప్రభుత్వం పేర్కొంది.
గత ఏడాది చైనాలో ఉద్భవించిన ఈ కరోనా వైరస్.. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడివరకూ వ్యాపిస్తోంది అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సాధారణంగా కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించిందని అంటున్నప్పటికీ అది ఎన్నో మార్గాల్లో వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, పెంపుడు జంతువుల్లోనూ ఈ వైరస్ సోకే అవకాశం ఉందని అనడానికి కచ్చితమైన ఆధారాలు లేవని హాంగ్ కాంగ్ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ అంటోంది.
మరి మనుషుల్లోకి వైరస్ సోకడానికి అసలు మూలం ఏంటి? అనేదానిపై స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మనుషుల్లో ఒకరినుంచి మరొకరికి సోకుతూ పోతున్న క్రమంలో తొలిసారి పెంపుడు కుక్కలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. మనుషుల్లో ఈ వైరస్ బారిన పడి 2,800కు పైగా మృత్యువాత పడగా, 82వేలమందికి పైగా వైరస్ సోకినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.