ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి విస్తృత స్థాయిలో పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి దిశగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశను పూర్తి చేసుకున్నాయి. చాలావరకు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ దశలో కొనసాగుతున్నాయి.
ఈ ట్రయల్స్ లో ఓ ఒక్క కరోనా వ్యాక్సిన్ విజయవంతమైనా కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ వ్యాక్సిన్ ట్రయల్స్ లలో 140 మందికి పైగా అభ్యర్థులపై పరీక్షించిన డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ట్రాక్ చేసింది.
టీకాలకు సాధారణంగా ఏళ్ల పాటు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ఉత్పత్తికి కూడా అదనపు సమయం పడుతుంది. అయితే శాస్త్రవేత్తలు 12 నుండి 18 నెలల్లో కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. టీకాలు వైరస్ ప్రభావాన్ని తట్టుకునేలా సమర్థవంతగా అభివృద్ధి చేయనున్నారు.
వైరస్ దాడిని తట్టుకునేలా శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చేయడానికి రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. ఇతర ఔషధాల కంటే అధిక భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిలియన్ల మంది ఆరోగ్యకరమైనవారికి ఈ వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయం గుర్తించుకోవాలి.
టీకాలు ఎలా పరీక్షిస్తారు? :
క్లినికల్ దశలోనే పరిశోధకులు రోగనిరోధక ప్రతిస్పందన ఉందో లేదో తెలుసుకోవడానికి జంతువులకు టీకా ఇస్తారు. క్లినికల్ టెస్టింగ్ మొదటి దశలో.. టీకా సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పరీక్షిస్తారు. రోగనిరోధక ప్రతిస్పందన నిర్ధారించడానికి ఎంపిక చేసిన వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇస్తారు.
దశ 2లో శాస్త్రవేత్తలు దాని భద్రత మరియు సరైన మోతాదు గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాతే టీకా వందల మందికి ఇస్తారు.
3వ దశలో, టీకా దాని భద్రతను నిర్ధారించడానికి వేలాది మందికి ఇస్తారు. ఇందులో వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దుష్ప్రభావాలను గుర్తిస్తారు.
చివరి దశలో టీకా ట్రయల్స్ విజయవంతమైతే.. ఆ తర్వాత విడతల వారీగా వ్యాక్సిన్ ఇస్తారు. ఇందులో సక్సెస్ సాధిస్తే.. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వస్తుంది.