Heart attack
Silent Heart Attack Symptoms: నరేందర్ కి ఆఫీస్ నుంచి హెల్త్ టెస్ట్స్ ప్యాకేజీ వస్తే టెస్టులు చేయించుకున్నాడు. అతడికి ఇంతకుముందెప్పుడో రెండు సార్లు గుండెపోటు వచ్చిపోయిందని తేలింది. అందరూ షాకయ్యారు. నరేందర్ కి గత ఎనిమిదేళ్లుగా షుగర్ ఉంది. తిమ్మిర్ల వంటి న్యూరోపతి లక్షణాలు కూడా ఉన్నాయి. గుండెపోటు వచ్చినట్టు తెలియక పోవడానికి ఇదే కారణం అన్నారు డాక్టర్లు. ఇంకోసారి వస్తే ప్రమాదమని కూడా హెచ్చరించారు.
నరేందర్ లాగా చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. ఇలాంటి గుండెపోట్లనే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు.
ఎందుకిలా?
డయాబెటిస్ ఉన్నవాళ్లలో షుగర్ కంట్రోల్ లో లేకపోతే అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిలో ఒకటి న్యూరోపతి. షుగర్ కంట్రోల్ లో ఉండకపోవడం వల్ల దాని ప్రభావం నాడీ కణాలపై కూడా పడుతుంది. దానివల్ల వాటి పని తీరు దెబ్బ తింటుంది. సాధారణంగా మనకు నొప్పి కలిగినప్పుడు ఈ నరాలే నొప్పికి సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. అప్పుడే మనకు నొప్పి అనేది తెలుస్తుంది. న్యూరోపతి వల్ల నరాలు ఈ సమాచారాన్ని చేరవేయలేవు. అందువల్ల వాళ్లకు నొప్పి తెలియదు. అందుకే ఇలాంటి వాళ్లకు గుండె నొప్పి వచ్చినా ఫీలవలేరు.
షుగర్ లేనివాళ్ళలో కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ రావొచ్చు. దీనికి కారణం.. అది గుండెనొప్పి అని గ్రహించలేకపోవడం. చాలా మైల్డ్ గా నొప్పి వచ్చినప్పుడు ఏదో అనీజీ గా ఫీలవుతారు. గాభరాగా అనిపిస్తుంది. ఏదో తెలియని అసౌకర్యం ఉంటుంది. అయితే ఇవన్నీ తీవ్రంగా ఉండవు. దాంతో ఎక్కువ పని ఒత్తిడి వల్ల అలసిపోయి అలా అనిపిస్తుందేమో అనుకుంటారు. కొన్నిసార్లు ఎక్కువగా తినేసినా, అసిడిటీ – గ్యాస్ సమస్య వచ్చినా ఆయాసంగా, డిస్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. నొప్పి లాంటి ఫీల్ కూడా ఉంటుంది. మైల్డ్ హార్ట్ ఎటాక్ లో కూడా ఇలా ఉండొచ్చు. దానివల్ల కూడా గుండెపోటు అని గుర్తించలేకపోతారు.
ఏం చేయాలి?
ఇలా సైలెంట్ హార్ట్ అటాక్స్ వల్ల గుండె మీద ప్రభావం పడుతుంది. కాబట్టి వీటిని గుర్తించడం, జాగ్రత్త పడటం అవసరం. అందుకే ఛాతీలో నొప్పి లాంటి భావన, అనీజీగా ఉండటం, చెమటలు పట్టడం లాంటివి ఉంటే గుండెపోటు కాదని నిర్ధారించుకోవడం అవసరం. “ఏదో తేడా” ఫీలింగ్ కలిగినప్పుడు అశ్రద్ధ చేయొద్దు. ఒకసారి డాక్టర్ ని కలవడం మంచిది. అది గుండెపోటు కాకపోతే బాధే లేదు. అవసరమైతే ఈసీజీ, టీ ఎం టీ, 2డి ఎకో టెస్టులు చేయించుకోవాలి.
ముఖ్యమైన లక్షణాలు..
– ఆయాసం. నిన్నటివరకు రెండు మూడు అంతస్థులు సునాయాసంగా ఎక్కిన వాళ్ళు ఇప్పుడు ఒక్క ఫ్లోర్ ఎక్కడానికే ఆయాసపడుతున్నారంటే వెంటనే అప్రమత్తం కావాలి.
– ఛాతీలో అసౌకర్యం, విపరీతమైన చెమట. గుండెనొప్పి అంటే గుండె ఉన్న చోటే రావాలని లేదు. కడుపు, దవడ, ఎడమ చెయ్యి, వెన్నులో కూడా నొప్పి రావొచ్చు.
– నొప్పి ఎక్కడ అనేదాని కన్నా ఏ రకంగా ఉందనేది ఇంపార్టెంట్. నొప్పి తేడాగా ఉండటాన్ని ఎవరికి వారు గమనించగలుగుతారు. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
గుండె ఆరోగ్యం కోసం..
వారానికి కనీసం నాలుగు రోజుల వాకింగ్ చాలు.. గుండె హ్యాపీ గా ఉండటానికి. అయితే, మీరెప్పుడూ నడిచే వేగానికి 10 శాతం ఎక్కువ వేగంతో కనీసం 20 నిమిషాల పాటు నడవాలి.
ఎవరికి వారు ఏది పడితే అది జిమ్ లో ఎక్సర్ సైజులు చేయొద్దు. ట్రైనర్ల సహాయం తప్పనిసరి. మీ శరీర స్వభావానికి, కండిషన్ కు సరిపడే వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
కొలెస్ట్రాల్ పెంచే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ఫామిలీ హిస్టరీ ఉన్నవాళ్లు 40 ఏళ్ళు దాటగానే రెగులర్ గా టెస్టులు చేయించుకోవాలి.
అన్నింటికన్నా ముఖ్యమైంది.. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం. సంతోషంగా ఉండటమే మీ గుండెకు బలాన్నిస్తుంది.
– డాక్టర్ హేమంత్
డైరెక్టర్, సెంచరీ హాస్పిటల్, హైద్రాబాద్