Yoga For Children: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఒత్తిడి .. పిల్లలకు యోగా ఒక వరం.. ఏ ఏ ఆసనం దేనికి మంచిదంటే?

Yoga For Children: పిల్లలు యోగ చేయడం వల్ల శరీరం వశ్యంగా, చురుకుగా తయారవుతుంది. పెరుగుదలకు సహాయపడుతుంది.

Children Doing Yoga

ప్రస్తుతం సమాజంలో చిన్న పిల్లలపై ఒత్తిడి చాలా పెరుగుతోంది. స్కూల్, హోమ్‌వర్క్, పరీక్షలు, గేమ్స్, మొబైల్ స్క్రీన్‌లు ఇలా చాలా విషయాలు పిల్లల మనస్తత్వాన్ని ప్రభావం చేస్తున్నాయి. ఆ ఒత్తడిని తట్టుకోలేక చాలా మంది చిన్న తనంలోనే ప్రాణాలుతీసుకుంటున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అలాంటి వారికి యోగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. యోగా కేవలం శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా శక్తినిచ్చే ఒక అద్భుత మార్గం. అందుకే పిల్లలకు చిన్న తనం నుండే యోగా, ప్రాణాయామం లాంటివి అలవాటూ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మరి యోగా వల్ల పిల్లలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలలో యోగా ప్రయోజనాలు:

  • శారీరక ఆరోగ్యం: పిల్లలు యోగ చేయడం వల్ల శరీరం వశ్యంగా, చురుకుగా తయారవుతుంది. పెరుగుదలకు సహాయపడుతుంది. జీర్ణక్రియ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
  • ఏకాగ్రత పెరుగుతుంది: క్రమం తప్పకుండ యోగా చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. మొబైల్, టీవీ వంటి అలవాట్లపై నియంత్రణ ఏర్పడుతుంది.
  • ఒత్తిడి తగ్గుతుంది: యోగా పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ఫ్రెష్ గా ఉంటే చదువు కూడా బాగా అర్థమవుతుంది. పరీక్షల సమయంలో ఉండే ఒత్తడిని కూడా తట్టుకునే శక్తిని ఇస్తుంది. చిన్నతనంలోనే మానసిక స్థైర్యం పెంపొందుతుంది
  • ఆత్మవిశ్వాసం & స్వీయ నియంత్రణ: యోగా చేయడం వల్ల పిల్లలు తమ శరీరాన్ని, భావోద్వేగాలను క్రమబద్ధంగా నియంత్రించగలుగుతారు. చేసే పనిలో నిబద్ధత, పట్టుదల పెరుగుతుంది.
  • ఆరోగ్యకరమైన నిద్ర: ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు యోగా మంచి పరిష్కారం అనే చెప్పాలి. యోగాసనాలు మరియు ప్రాణాయామం ద్వారా నిద్ర సమస్యలు తగ్గుతాయి.

పిల్లలకి అనువుగా ఉండే యోగాసనాలు:

  • తాడాసనం: శరీరాన్ని, వెన్నెముకను నిటారుగా సూటిగా ఉంచే ఈ ఆసనం పెరుగుదలలో తోడ్పడుతుంది
  • వృక్షాసనం: శరీర సమతుల్యత మెరుగవుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది
  • భుజంగాసనం: వెన్నెముకను బలంగా తయారుచేస్తుంది. ఊపిరితిత్తుల శక్తిని పెంచుతుంది
  • బాలాసనం: శరీరానికి విశ్రాంతి ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • మార్జరీ ఆసనం: నాడీ వ్యవస్థకు మంచి ఉల్లాసాన్ని ఇస్తుంది.
  • నడి-నవకాసనం: అబ్డొమినల్ మసిల్స్‌కు బలం చేకురుస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది.