Health Risk with Rusk: టీ, కాఫీలతో రస్క్ ఎక్కువగా తింటున్నారా.. అయితే రిస్క్ చేస్తున్నట్టే.. ఒకసారి ఇవి తెలుసుకోండి

Health Risk with Rusk: రస్క్ అంటే మెత్తగా రిఫైన్ చేసిన మైదా, చక్కెరతో తయారు చేయబడిన పదార్థం. ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.

Health problems caused by eating rusks with tea and coffee

మనలో చాలా మందికి ఉదయం, సాయంత్రం టీ లేదా కాఫీతో రస్క్ (Rusk) తినడం అలవాటుగా ఉంటుంది. నిజానికి టీ, కాఫీ, రస్క్ ఈ మూడింటి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. పొడి పొడిగా, క్రంచీగా ఉండే ఈ రస్క్‌ తియ్యగా, తినడానికి తేలికగా ఉండటంతో చాలామంది ఇవి తినడానికి ఇష్టపడతారు. కానీ, ఈ రస్క్ లను ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. రస్క్ అనేది హై రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్, ఎక్కువ చక్కెర, తక్కువ పోషక విలువ కలిగిన ప్రాసెస్ చేసిన ఫుడ్. కాబట్టి, దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.డయాబెటిస్ రిస్క్:
రస్క్ అంటే మెత్తగా రిఫైన్ చేసిన మైదా, చక్కెరతో తయారు చేయబడిన పదార్థం. ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి, రస్క్ తిన్న వెంటనే రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతాయి. తరుచుగా తినడం వల్ల దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. టీ/కాఫీలో చక్కెర వేసుకుంటే ఈ ప్రమాదం మరింత పెరగవచ్చు.

2.బరువు పెరుగుదల:
రస్క్‌లో అధిక కార్బోహైడ్రేట్లు, మైదా, చక్కెర, కొవ్వు పదార్థాలు, చాలా తక్కువ ఫైబర్, తక్కువ ప్రోటీన్ ఉంటాయి. తరచూ తినడం వల్ల ఖాళీ కాలరీలు శరీరంలో పేరుకుపోతాయి. శరీరం దీన్ని కొవ్వుగా నిల్వ చేయడం వల్ల బరువు పెరుగుతుంది.

3.జీర్ణ సమస్యలు:
మైదాతో తయారుచేయబడిన రస్క్‌ తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ప్యాకింగ్ చేసిన రస్క్‌లలో ప్రిజర్వేటీవ్స్, బేకింగ్ సోడా ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల అజీర్ణం, గ్యాస్, బ్లోటింగ్, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఇది పేగుల పని తీరును కూడా దెబ్బతీస్తుంది.

4.హార్ట్ సమస్యలు:
కొన్ని రస్క్‌లు హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ లేదా ట్రాన్స్ ఫాట్స్‌తో తయారవుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) పెంచి మంచిది (HDL) కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. వీటిని దీర్ఘకాలంగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది.

5.పోషకాల లోపం:
రస్క్ అనేది ఎంప్టీ కాలరీస్ పదార్థం. అంటే ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కాకుండా కేవలం క్యాలరీస్ మాత్రమే అందిస్తుంది. రోజూ రస్క్ తినడం వల్ల ఆహారంలో అవసరమైన పోషకాలు తగ్గిపోతాయి. దీర్ఘకాలంలో శక్తిలేమి, విటమిన్ లోపాలు, చర్మ సమస్యలు మొదలవుతాయి.

రస్క్ కి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు:

  • టీతో సున్నపిండి బిస్కెట్లు, మల్టీగ్రెయిన్ బిస్కెట్లు తినడం మంచిది
  • బాదం, వాల్‌నట్, సునాఫ్లవర్ సీడ్స్ వంటి హెల్తీ స్నాక్స్ తీసుకోండి
  • చిన్న మోతాదులో డ్రై ఫ్రూట్స్ తినండి
  • హోమ్‌మేడ్ బేకింగ్, ఓట్స్ లేదా విట్ ఫ్లోర్‌తో తయారైన రస్క్‌లు తినండి.