మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసే పనులను బట్టి, మన అలవాట్లను బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ, చాలా మంది ఆరోగ్యానికి చెడు చేసే పనులనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది కూడా తెలిసే చేస్తున్నారు. కాబట్టి, మన నిత్య జీవితంలో చిన్న మార్పులు, మంచి మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ అలవాట్లు మన జీవితాన్నే మార్చేయవచ్చు. అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు మన శరీరానికి సహజమైన డిటాక్స్ ప్రక్రియగా పని చేస్తుంది.
రాత్రిపూట 5 నుంచి 7 తులసి గింజలను నీటిలో నానబెట్టండి. ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలోని తేమను సమతుల్యం చేస్తుంది. దీనికి ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇలా రోజు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ఉందయం నిద్ర లేవగానే ఫోన్ వాడకం అనేది ప్రశాంతతను తగ్గిస్తుంది. దానికి బదులుగా పచ్చని చెట్ల మధ్య కాసపు గడపడం, డాబా పైన ఆకాశాన్ని చూస్తూ తిరగడం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఉదయాన్నే కనీసం 5 నిమిషాల పాటు స్ట్రెచింగ్ లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కండరాల బలంగా తయారవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తక్కువ చక్కెర కలిగిన సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ధాన్యాలు, పండ్లు, నట్స్ తీసుకుంటే ఇంకా మంచిది.
చాలా చిన్నగా కనిపిస్తున్న ఈ పనులు మన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి, ఈ పనులను అలవాటు చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి.