కరోనా టెస్టులు ఎలా చేస్తారు..? వైరస్ సోకినట్లు ఎలా గుర్తిస్తారు..? 

కరోనా వైరస్ టెస్ట్‌లు ఎలా ఉంటాయి..? వైరస్ సోకినట్టు ఎలా గుర్తిస్తారు..? పేషెంట్ నుంచి ఏమేం సేకరిస్తారు..?

  • Publish Date - March 29, 2020 / 07:28 PM IST

కరోనా వైరస్ టెస్ట్‌లు ఎలా ఉంటాయి..? వైరస్ సోకినట్టు ఎలా గుర్తిస్తారు..? పేషెంట్ నుంచి ఏమేం సేకరిస్తారు..?

కరోనా వైరస్…ఇప్పుడిదీ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే కరోనా వైరస్‌ సోకిందో..లేదో..తెలుసుకునేందుకు టెస్ట్‌లు చేస్తారు. అయితే టెస్ట్‌లు చేస్తారని తెలుసు కానీ..ఆ టెస్ట్‌లు ఎలా చేస్తారో ఎవరికి తెలియదు. మరి ఆ టెస్ట్‌లు ఎలా ఉంటాయి..? వైరస్ సోకినట్టు ఎలా గుర్తిస్తారు..? పేషెంట్ నుంచి ఏమేం సేకరిస్తారు..?

వివిధ మార్గాల్లో కరోనా వైరస్‌ టెస్టింగ్‌
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏ మాత్రం అనుమానంగా ఉన్నా… ప్రజలను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అయితే అక్కడ టెస్టుల్లో భాగంగా ముందుగా…కరోనా వైరస్ ఉందని అనుమానిస్తున్న వ్యక్తి నోటి నుంచి లాలజలాన్ని సేకరిస్తారు. తడి దగ్గు ఉన్న వారి నుంచి కఫాన్ని కూడా తీసుకుంటారు. కరోనా ముఖ్యంగా ఊపిరితిత్తులపై దాడి చేసే వైరస్ కావడంతో ఇప్పటి వరకైతే బాడీ ఫ్లూయిడ్స్‌ను చెక్ చేసినట్టు ఆధారాలు లేవు. శాంపిల్స్ తీసుకున్నాక స్టెరైల్ ట్యూబ్‌లో భద్రపరుస్తారు. అతి తక్కువ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేస్తారు. ఆ తర్వాత నోటిఫై చేసిన ల్యాబ్‌కు పంపిస్తారు. స్టోర్ చేసిన శాంపిల్స్ 72గంటల వరకు ఉంటుంది. టెస్టింగ్‌కు సమయం పడుతుందని తెలిస్తే స్టోరేజ్‌కి డ్రై ఐస్‌ను వాడుతారు. ఒకవేళ పరీక్షలకి టైమ్ ఎక్కువ పడితే  వైరస్ జెనెటిక్ మెటిరియల్ నాశనం అవుతుంది. దీంతో టెస్ట్ నెగెటివ్‌గా వస్తుంది. 

జెనెటిక్‌ కోడ్‌ ద్వారానే వైరస్‌ నిర్ధారణ
ఇక నమూనా వచ్చాక టెస్టింగ్‌కి ఆర్టీపీసీఆర్ పద్దతిని వాడుతారు. దీని ద్వారానే కరోనా వైరస్ ఉందో లేదో కనుక్కుంటారు. ఈ టెస్ట్‌ను ఫ్లూ వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా చేస్తారు. ప్రతి జీవికి ప్రత్యేకమైన డీఎన్ఏ ఉన్నట్టే ప్రతీ వైరస్‌కి ప్రత్యేకమైన జెనెటిక్ కోడ్ ఉంటుంది. దీన్నే వైరల్ జినోమ్ అంటారు. దీని ద్వారానే వైరస్ ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది. సేకరించిన నమూనా నుంచి వైరస్ జీనోమ్‌ను వేరు చేసేందుకు రకరకాల పదార్థాలు కలుపుతారు. ఇందులో కొన్నింటిని కరోనా వైరస్ నుంచే తీసుకుంటారు. ఆ పూర్తి సోల్యూషన్‌ని టెస్టింగ్ మెషిన్ కింద పెడతారు. వైరస్ ఉన్నట్టు తేలితే జెనెటిక్ మెటీరియల్ విస్తరిస్తుంది. 

24 గంటల్లో రిజల్ట్‌
తక్కువలో తక్కువ 24 గంటల్లో రిజల్ట్ వస్తుంది. ఆ టైంలో పేషెంట్‌ను ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఓ పేషెంట్ నుంచి వైరస్‌ను ఐసోలేట్ చేసిన చైనా ఈ ఏడాది జనవరి 11న గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ ప్లుయెంజా డేటాకు వివరాలిచ్చింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు వైరస్ జీనోమ్ డేటాను అర్థం చేసుకుని, అది ఎలా పుట్టింది, ట్రీట్‌మెంట్ విధానం తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటిదాకా 20కి పైగా దేశాలు వైరస్ డేటాను షేర్ చేశాయి.

See Also | కరోనా మొదట ఎవరికి సోకింది..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?