ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కోవిడ్-19)ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదు. అమెరికాలోని సీటెల్ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. కరోనాకు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ సమర్థవంతంగా పనిచేస్తోందని గురువారం ట్రంప్ ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు FDA కూడా అఫ్రూవ్ చేసిందన్నారు.
కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదించిందన్నారు. ఇప్పటికిప్పుడు ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపిన ట్రంప్ ఇది కచ్చితంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గొప్పదనమేనని చెప్పారు. తాము కూడా కరోనా ట్రీట్మెంట్ లో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడామని, సమర్ధవంతంగా పని చేసిందని చైనా అధికార మీడియా జిన్హువా ఫిబ్రవరిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియా, బెల్జియం కూడా ఇదే ఔషధాన్ని వాడుతున్నట్లు తెలిపింది.
యాంటీబయాటిక్ అజిత్రొమైసిన్‌తో కలిపి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటే.. రోగి శరీరంలో వైరస్ తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది. మలేరియా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ మందును 1944లో ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో ఓ రకం కాలేయ వ్యాధి కూడా వాడేవారు. కాగా, రాజస్థాన్‌లో కరోనా వైరస్ నిర్ధారణ అయిన ఇటలీ దంపతులకు కూడా క్లోరోక్విన్ ఇచ్చినట్టు వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా,FDA అనుమతి కోసం ఇతర యాంటీవైరల్ ఔషధాలను కూడా గుర్తించనున్నట్టు తెలిపారు. టీకాలు, ఇతర చికిత్సలకు ఆమోదం వేగవంతం చేయడానికి నిబంధనలను సడలించినట్టు ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదించిందన్నారు. కోవిడ్ రోగుల విస్తృత ప్రయోజనాల కోసం మరిన్ని ఔషదాలను వినియోగానికి అనుమతి తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు అమెరికాలో 14వేల 371మందికి కరోనా సోకగా,217మంది ప్రాణాలు కోల్పోయారు. 125మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు.
ఇదిలా ఉండగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొంటున్న స్వచ్ఛంద కార్యకర్తలపై కూడా ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ డ్రగ్ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందా? లేదా? అని పరీక్షించనున్నారు. క్లోరోక్విన్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో వినియోగిస్తామని ఎఫ్‌డీఏ కమిషనరల్ డాక్టర్ స్టీఫెన్ హన్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తామని, చికిత్సలో దుష్ప్రభావాలు, సమర్థత గురించి ఆ డేటా ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.