ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని కూడా కరోనా పట్టిపీడుస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి ఎలా మారుతుంది అనేదానిపై తీవ్ర భయాందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి.
కరోనా నియంత్రణకు కఠినమైన చర్యలను చేపడుతున్నాయి. చైనా తరహాలో కరోనా కట్టడి చేసేందుకు భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు ఐసోలేషన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. Covid-19 వైరస్‌కు ఎలాంటి మందు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేయాలంటే అంత సులభమైన విషయం కాదు.. కానీ, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సులభమైన మార్గం ఉంది.
See Also | 10వేలు దాటిన కరోనా మృతులు…అలాగే జరిగితే భారత్ లో 30కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం
ప్రతిఒక్కరూ ఒకరినొకరు దూరంగా ఉండేలా ప్రయత్నించాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే మాత్రం ఎవరికి వారు స్వీయ నిర్భందం చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ విషయంలో చైనా కరోనాపై విజయం సాధించింది. ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుతో పాటు ప్రతిఒక్కరిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్భందం చేసింది. ప్రతిఒక్కరిని ఐసోలేషన్ అయ్యేలా చర్యలు చేపట్టింది.
అంతే.. గురువారం నాటికి చైనాలో ఒక కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దెబ్బకు కరోనా వ్యాప్తి కంట్రోల్లోకి వచ్చేసింది. చైనా ఐసోలేషన్ ఫార్మూలను ఇతర దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇప్పటివరకూ చైనాలో 80వేల వైరస్ కేసులు నమోదు కాగా, 3,252 మంది మృతిచెందారు.
వుహాన్ సిటీలో కరోనా ప్రారంభ స్థాయిలో గత డిసెంబర్‌లో తొలి కేసును స్థానిక అధికారులు గుర్తించారు. ప్రజల్లో భయాందోళన తలెత్తకుండా ఉండేందుకు అక్కడి వైద్యులు, అధికారులు మౌనం వహించారు. జనవరి 23నాటికి చైనాలో వైరస్ వ్యాప్తి ఉధృత స్థాయికి చేరుకుంది. ఏమాత్రం ఆలోచించకుండా తొలుత వుహాన్ సిటీని లాక్ డౌన్ చేసింది. ఆ తర్వాత ప్రధాన నగరాలను లాక్ డౌన్ చేసింది. రెండు నెలల తర్వాత చైనా వైరస్ వ్యాప్తినిబట్టి సరిహద్దులను మూసివేసింది.