japanese walking benefits
జపనీస్ వాకింగ్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ట్రెండ్. చాలా మంది ఇప్పుడు దీన్నీ ఫాలో అవుతున్నారు. దీనికి ఖరీదైన పరికరాలు ఏమీ అవసరం లేదు. నడకలోనే ఇదో కొత్త పద్ధతి. కానీ, దీనివల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. జర్నల్ ఆఫ్ డయాబెటిస్ ఇన్వెస్టిగేషన్ 2025లో ప్రచురితమైన క్లినికల్ ట్రయల్ ప్రకారం జపనీస్ వాకింగ్ శారీరక పనితీరును, జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందని తెలిసింది. మరీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, కండరాల బలహీనత ఉన్నవారికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందట.
నిజానికి జపనీస్ వాకింగ్ అనేది ఒక ప్రత్యేకమైన వ్యాయామ పద్ధతి. దీనిని జపాన్‌లోని షిన్షు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హిరోషి నోస్, అసోసియేట్ ప్రొఫెసర్ షిజు మసుకి పరిచయం చేశారు. ఈ వాకింగ్ ఒక సాధారణ ఇంటర్వెల్ ఫార్మాట్ ను అనుసరిస్తూ ఉంటుంది. 30 నిమిషాల నడకలో 3 నిమిషాలు వేగంగా నడవడం, తరువాతి 3 నిమిషాలు నెమ్మదిగా నడవడం ఈ నడకలో ప్రత్యేకం. అలా కనీసం 30 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వారంలో కనీసం నాలుగుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట.
ఈ అధ్యాయనంలో టైప్ 2 డయాబెటీస్, కింద కండరాలు బలహీనపడిన 50 మంది వ్యక్తులతో దాదాపు 5 నెలలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అందులో అద్భుతమైన ప్రయోజనాలను కనుగొన్నారట. జపనీస్ వాకింగ్ చేసిన వారిలో శారీరక జీవన నాణ్యతలో మెరుగుదల కనిపించిందని పరిశోధకులు కనుగొన్నారు. ఇంకా ఈ రకమైన నడక వల్ల కేవలం డయాబెటీస్ మాత్రమే కాదు.. VO₂maxను మెరుగుపరచగల సామర్థ్యం, రక్తపోటును తగ్గించడం, జీవక్రియ పనితీరును మెరుగుపరచడం వంటి లాభాలు కూడా ఉన్నాయట. కాబట్టి, మనం రోజు నడిచే సాధారణ నడకలో చిన్న మార్పు పెద్ద లాభానికి దారితీస్తుంది. కాబట్టి, మీరు కూడా ఈ జపనీస్ వాకింగ్ ను అలవాటు చేసుకోండి.