Men should definitely undergo these tests after the age of 40.
40 ఏళ్ల వయస్సు అనేది పురుషులలో ఆరోగ్య పరంగా కీలక మైలురాయి. ఈ దశలో శరీరంలో హార్మోన్ల మార్పులు, జీవనశైలి ప్రభావం, వృద్ధాప్య లక్షణాల ప్రారంభం అవుతూ ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించడానికి, క్రమం తప్పకుండా కొన్ని ముఖ్యమైన పరీక్షలు(టెస్టులు) చేయించుకోవడం చాలా అవసరం. మరి అలాంటి ప్రధానమైన 5 రకాల పరీక్షల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.రక్తపోటు పరీక్ష:
హై బ్లడ్ ప్రెజర్ (హైపర్టెన్షన్) అనేది సైలెంట్ కిల్లర్ అని చెప్పాలి. ఇది గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణం. కాబట్టి, ప్రతీ ఏటా ఒక్కసారైనా ఇది చెక్ చేయించుకోవడం చాలా అవసరం. బీపీ ఎక్కువగా ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా ప్రకారం తరచూ పరీక్షలు చేయించుకోవాలి.
2.షుగర్ లెవల్స్ / డయాబెటిస్ స్క్రీనింగ్:
టైప్ 2 డయాబెటిస్ 40 ఏళ్ళ తరువాత ఎక్కువగా కనిపించే వ్యాధి. తొలిదశలో గుర్తించకపోతే, కళ్ళు, కిడ్నీ, నరాల సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి HbA1c టెస్ట్ లేదా ప్రతి ఏడాది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేయించుకోవడం మంచిది.
3.కొలెస్ట్రాల్ టెస్ట్:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికంగా ఉంటే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) తక్కువగా ఉంటే కూడా ప్రమాదమే. కాబట్టి 40 ఏళ్ల తర్వాత ప్రతి 1 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
4.ప్రోస్టేట్ ఆరోగ్య పరీక్ష:
ప్రోస్టేట్ గ్రంధి పెద్దదవడం లేదా క్యాన్సర్ వంటి సమస్యలు వృద్ధాప్యంలో మొదలవుతాయి. వీటిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స అందించడం సులభం అవుతుంది. కాబట్టి, డాక్టర్ సలహా ప్రకారం 45 నుంచి 50 ఏళ్ల వయసులో PSA టెస్ట్ ప్రారంభించాలి. కుటుంబ చరిత్ర ఉంటే మరింత ముందే చేయించుకోవడం మంచిది.
5.కాలనోస్కోపీ:
కాలన్ క్యాన్సర్ 50 ఏళ్ల లోపు కనిపించే క్యాన్సర్లలో ఒకటి. ఇది తొలిదశలో లక్షణాలు లేకుండా ఉంటే, కాలనోస్కోపీ ద్వారా త్వరగా గుర్తించవచ్చు. కాబట్టి, 50 సంవత్సరాల వయస్సులో మొదటి కాలనోస్కోపీ చేయించాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటే 45 ఏళ్ల నుంచే చేయించవచ్చు. ఫలితాల ఆధారంగా ప్రతి 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయాలి.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కంటే, ముందస్తుగా పరీక్షలు చేయించుకుని సురక్షితంగా ఉండటం మంచిది. పై టెస్టులు మగవాళ్లు 40 ఏళ్లు దాటిన తరువాత తప్పకుండా చేయించుకోవాలి.