సికింద్రాబాద్ ప్యారడైజ్ బిర్యానీ ప్రప్రంచ ప్రసిధ్ధి పొందింది. ఇప్పుడదే ప్యారడైజ్ జంక్షన్ దేశంలోనే అత్యంత ధ్వని కాలుష్యం వెదజల్లే ప్రాంతంగా కూడా పేరు సంపాదించింది. 2018 చివరి నాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సేకరించిన వివరాల ప్రకారం ప్యారడైజ్ జంక్షన్ లో దేశంలోనే అత్యంత ఎక్కవ స్ధాయిలో 79 డెసిబుల్స్ ధ్వని కాలుష్యం వెదజల్లుతున్నట్లు తెలిపింది.
నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జాం లోంచి తప్పించుకుని బయటపడటం అంటే మాటలు కాదు, పద్మవ్యూహాంలోంచి బయటపడ్డట్టే. ప్రత్యేకించి ద్విచక్ర వాహానదారుల కష్టాలు మాటల్లో చెప్పలేం. ఇంతటి మహానగరం ఇప్పుడు దేశంలోనే అత్యంత శబ్దకాలుష్యం వెదజల్లే ప్రధాన నగరంగా పేరు గాంచింది. హైదరాబాద్ మహా నగరంలో నిత్యం సుమారు 50 లక్షల కార్లు రోడ్లపై తిరుగుతుంటాయి.
అంతకు రెట్టింపు సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు బస్సులు…. ఇలా వీటి నుంచి వచ్చే ధ్వని కాలుష్యంతో నగరం ధ్వని కాలుష్యం వెదజల్లే నగరాల్లో రెండవ స్ధానంలో నిలిచింది. ముఖ్యంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద దేశంలోనే అత్యధికంగా ధ్వని కాలుష్యం వెదజల్లే మొదటి ప్రదేశంగా CPCB గుర్తించింది.
నగరంలో శబ్దకాలుష్య నమోదు ప్రాంతాలు
హైదరాబాద్ లో ఆబిడ్స్, పంజాగుట్ట,(వాణిజ్యప్రాంతం) జీడిమెట్ల(పారిశ్రామికి ప్రాంతం) జూపార్క్ (సైలెన్స్ జోన్) గచ్చిబౌలీ, జూబ్లీ హిల్స్ (నివాస ప్రాంతం)లో మాత్రమే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ధ్వని కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. ప్యారడైజ్ ట్రాపిక్ సిగ్నల్స్ వద్ద 79 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం నమోదవుతోంది. ఇక్కడ ఆస్పత్రులు,వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలు ఉన్నప్పటీకీ శబ్ద కాలుష్యం ఫ్రమాద స్ధాయిలో ఉంది.
నియంత్రణ చర్యలేవి ?
హైదరాబాద్ లో శబ్ద కాలుష్యనియంత్రణకు ప్రభుత్వం చర్యలేమీ తీసుకోలేదని ఆ నివేదికలో పేర్కోన్నారు. హైదరాబాద్ లో సున్నిత, నో సౌండ్ పొల్యూషన్ ప్రాంతాల్లోనూ విపరీతమైన ధ్వని కాలుష్యం ఉన్నట్లు లెక్కతేలింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో సేకరించిన గణాంకాల ఫ్రకారం హైదరాబాద్ రెండో స్ధానంలో(67.1 డెసిబుల్స్) ఉండగా చెన్నై మొదటిస్ధానంలో (67.8 డెసిబుల్స్) ఉంది. ఆతర్వాత కోల్‌కతా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఉన్నాయి.
ఢిల్లీతో సహా దేశంలోని పలు నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్య ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయని రికార్డులు చెబుతున్నాయి. నివాస ప్రాంతాల్లో పగటి పూట 55 డెసిబుల్స్ మించకూడదు.రాత్రి పూట 45డెసిబుల్స్ మించకూడదు. కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని ఆరు మెట్రో నగారాల్లోని 13 నివాస ప్రాంతాల్లో జరిపిన సర్వేలో ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు. శబ్ద కాలుష్య నియంత్రణ మండలి సూచించిన లెక్కల ప్రకారం సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద పగటిపూట సగటు శబ్దం స్థాయిలు 67.8 డెసిబెల్స్ మించి ఉండకూడదు. కానీ ప్యారడైజ్ వద్ద అంతకంటే ఎక్కువ సంఖ్యలో కాలుష్యం నమోదవుతోంది. శబ్ద కాలుష్యం నివారణకు ఫ్రభుత్వం చర్యలు తీసుకోవాలి . అందుకు కారణమయ్యే వారిపై ట్రాఫిక్, రవాణా, పోలీసుల శాఖ వారు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ ఆయా శాఖలు అలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది.
ముంబై పోలీసుల నియంత్రణ చర్యలు
కాగా… ఇటీవల ముంబై పోలీసులు శబ్ద కాలుష్య నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తోంది. “హాంక్ మోర్..వెయిట్ మోర్” వ్యవస్ధను అక్కడ అమలు చేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగిన వాహానదారులు కనీసం రెండు,మూడు నిమిషాల పాటు కూడా వెయిట్ చేయలేనంత అసహనంతో ఉంటున్నారు. ఇంకా గ్రీన్ సిగ్నల్ పడలేదని వివరీతంగా హరన్ కొడుతుంటారు. ఆప్రాంతంలో వచ్చే శబ్ద కాలుష్యాన్ని అక్కడి సిగ్నల్స్ లో ఏర్పాటు చేసిన సెన్సర్లు గ్రహించి శబ్దం పెరిగే కొద్దీ వాటిలో రెడ్ లైట్ సమయం మరింత పెరుగుతూ ఉంటుంది. ఈ నిర్ణయంతో ముంబైలోని ఫ్రధాన కూడళ్లలో శబ్ద కాలుష్యం క్రమేపీ తగ్గుముఖం పట్టింది.
ముంబైలోని ASHP హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతంలో (54 dB) నిశ్శబ్దంగా ఉంది. మరోక అంశం గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వాహానదారులు వారు వెళ్లవలసిన మార్గంలో వెళ్లకుండా తమ ముందు వాహనం కదలలేదనో, ఇంకేదో కారణంతో అదే పనిగా హారన్ మోగిస్తూ ఉంటారు. ఇది కూడా శబ్దకాలుష్యాన్నిపెంచేందుకు మరో కారణం అవుతోంది. ధ్వని కాలుష్యం పెరిగితే పలు రోగాలు వస్తాయని తెలిసినప్పటికీ ఎవరికీ వాటిపై అదుపు లేకపోవటంతో నానాటికీ ధ్వనికాలుష్యం పెరుగుతూనే ఉంది.
శబ్ద కాలుష్యం దుష్ప్రభావాలు
కర్ణభేరీ దెబ్బతినడం.. వినికిడి శక్తి తగ్గిపోవటం.. నిద్రలేమి ఏర్పడటం..మానసిక ఒత్తిడి పెరగటం.. గుండె జబ్బులకు దారితీయటం ..చిన్నపిల్లల్లో మతిమరుపు వంటి దుష్ప్రభావాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ లెక్కల ప్రకారం దక్షిణాసియాలో శబ్ద కాలుష్యం వల్ల ఇప్పటికే పిల్లలు, వృధ్దులలో వినికిడి లోపం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!