ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా కోరలు విప్పుతోంది. ఒక్కొక్కటిగా కరోనా కేసులు బయట పడుతున్నాయి. మాటువేసి చాటునుంచి కరోనా కాటేస్తోంది. ఇప్పటివరకూ విదేశాలకు వెళ్లొచ్చినవారికే కరోనా వైరస్ వచ్చిందని అనుకున్నారంతా.. కానీ, అలాకాదు.. ఇప్పుడు విదేశాలకు వెళ్లకపోయినా కూడా కరోనా వస్తోంది. తస్మాత్ జాగ్రత్త.. ఏవైపు నుంచి అయినా కరోనా వ్యాపించే అవకాశం ఉంది.
పుణెకు చెందిన 40ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఆమె ఇంట్లోనే ఉంటోంది.. విదేశాలకు వెళ్లలేదు.. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఎవరూ ఆమెను కలవలేదు. అయినా ఆమెకు వైరస్ వచ్చింది. ఎవరిని కలవకుండానే వైరస్ ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ బహిరంగ ప్రదేశాలకు వెళ్లి ఉంటుందా? లేదా ఎక్కడికి వెళ్లకుండా వైరస్ ఎలా సోకినట్టు? ఇప్పుడు ఇదే అధికారుల్లో అనుమానాలను రేకితిస్తోంది.
విదేశాల నుంచి వచ్చినవారితో కాంటాక్ట్ అయినవారికే మాత్రమే కరోనా పాజిటీవ్ అని వైద్యాధికారులు నిర్ధారించారు. ఇప్పటివరకూ దేశంలోని వారికి ఎక్కడా కూడా కరోనా కేసు నమోదు కాలేదు. మరి.. పుణె మహిళకు వైరస్ ఎలా సోకినట్టు అనేది అంతుపట్టడం లేదు.
ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుతో భారతీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పుణె మహిళ తీవ్ర గొంతు నొప్పితో బాధపడుతోంది. అది స్వైన్ ఫ్లూ (H1 N1) అని భావించిన ఆమె పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సెంటర్‌కు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుంది. ఆ వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ మహిళ విదేశాలకు వెళ్లివచ్చినట్టు దాఖలాలు లేవు. ఇటీవలే నేవి ముంబైలోని వాషీ ప్రాంతంలో మార్చి 3న జరిగిన పెళ్లికి వెళ్లొచ్చినట్టు అధికారి తెలిపారు. ‘ఈ కేసును విచారిస్తున్నామన్నారు. ఆమె కొవిడ్-19 పాజిటీవ్ అని తేలింది. విదేశాలకు వెళ్లొచ్చినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. విదేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఎవరితోనైనా ఆమె కలిసి ఉండొచ్చు’ అని జిల్లా కలెక్టర్ నావల్ కిషోర్ రామ్ తెలిపారు.
ముంబైకు ఆమె క్యాబ్ లో వెళ్లొచ్చినట్టుగా విచారణలో గుర్తించారు. అంతేకాదు.. ఇలాంటి కేసులపై వేర్వేరు మార్గదర్శకాలతో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మహిళ కరోనా కేసును ఉన్నతాధికారులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, పుణెలో 25ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా పాజిటీవ్ అని గుర్తించారు. ఇటీవలే అతడు ఐర్లాండ్ కు వెళ్లివచ్చినట్టు అధికారి ఒకరు వెల్లడించారు.