కళ్లలో దురద, మంటగా అనిపిస్తోందా? అది కరోనా లక్షణం కావొచ్చు.. జాగ్రత్త.. నిపుణులు హెచ్చరిక!

sore and itchy eyes could be early rare Coronavirus symptom : కళ్లలో మంటగా అనిపిస్తోందా? తరచుగా కళ్లు దురద పెడుతున్నాయా? అయితే అది కరోనా ప్రారంభ లక్షణం కావొచ్చు జాగ్రత్త అంటున్నారు నిపుణులు. సాధారణంగా కరోనా సోకినవారిలో ప్రధాన లక్షణాల్లో నిరంతర దగ్గు, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కొత్త అధ్యయనంలో మాత్రం కోవిడ్-19 అరుదైన లక్షణాల్లో కళ్లలో మంట, దురద ఒకటిగా తేలింది.

అంగిలా రస్కిన్ యూనివర్శిటీ ఈ కొత్త అధ్యయాన్ని నిర్వహించగా.. బీఎంజె ఓపెన ఆప్తామాలజీ జనరల్‌లో ప్రచురించారు. 83 మంది కరోనా బాధితుల డేటాపై నిశితంగా విశ్లేషించారు. దగ్గు, జ్వరం, అలసట, రుచి, వాసన కోల్పోవడం వంటివి సాధారణ కరోనా లక్షణాలుగా గుర్తించారు. అలాగే 18 శాతం మందిలో ఫొటోఫోబియాగా పిలిచే లైట్ సెన్సివిటీని నిపుణులు గుర్తించారు.

మరో 17శాతం కరోనా బాధితుల్లో కళ్లలో దురద, 16 శాతం మందిలో కళ్లలో మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయని కనుగొన్నారు. కరోనా లక్షణాలు మొదలైన రెండు వారాల్లోనే అధిక మొత్తంలో కరోనా పేషెంట్లు కంటి సమస్యలతో తీవ్రంగా బాధపడినట్టు గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ ప్రకారం.. కరోనా పేషెంట్లలో ఒకటి నుంచి మూడు శాతం వరకు కండ్ల కలక వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

అలా అని ఎవరిలోనైనా ‘పింక్ ఐ’ కన్ను ఎర్రబారితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కళ్లలో నుంచి నీరు కారడం, మంట, దురద వంటి సమస్యలు ఇతర అలర్జీకి సంబంధించి కూడా కారణం కావొచ్చునని సూచిస్తున్నారు.