కరోనా రాకుండా చిలుకూరులో ప్రత్యేక పూజలు

  • Publish Date - February 6, 2020 / 09:24 AM IST

చైనాలోని వూహాన్ లో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి  చైనాలో 400 మందికి పైగా చనిపోయారు. మరో  20 వేల మంది వైరస్ బారిన పడి ఉన్నారని…. వారిలో దాదాపుగా 250 మందికి కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో ఉందని తెలుస్తోంది. దీనితో కరోనా వైరస్ దెబ్బకు చైనాకు చెందిన ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ(who) కరోనా వైరస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కరోనా వైరస్ పై హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించడం కూడా జరిగింది.   మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభు్త్వం కూడా అప్రమత్తమై  ఎప్పటి కప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తోంది. కరోనా వైరస్‌ విజృంభించిన నాటి నుంచి బుధవారం వరకు నగరంలో కరోనా వైరస్‌ నమోదు కాలేదు. అనుమానం తో పరీక్షలు చేయించుకున్న 25 మందికి ఎలాంటి వైరస్‌ లేదని వైద్యపరీక్షల ద్వారా ఇప్పటికే తేలిపోయింది. 

కాగా… మానవ ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోకి కరోనా వైరస్‌ రాకుండా చిలుకూరు బాలాజీ ఆలయంలో  గురువారం, ఫిబ్రవరి6న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌, సౌందర్యరాజన్‌ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది భక్తులు పాల్గొన్నారు. పూజా నిర్వహణ అనంతరం తీర్థాన్ని భక్తులందరిపై చల్లారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా చిలుకూరు బాలాజీ స్వామివారు ముందుంటారన్నారు. అవి రైతు ఆత్మహత్యలైనా, అత్యాచారాలైనా స్వామివారి ఆశీస్సులతో తాము పోరాడుతామన్నారు.

మరోవైరు హైదరాబాద్ లో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు సోషల్ మీడియాలో ప్రచారం వల్ల ప్రజలు  అప్రమత్తమవుతున్నారు.  కరోనా వైరస్ లేకపోయినా… తమకు ఉందేమో అన్న అనుమానంతో కేసులు ఎక్కువవుతున్నాయి. చాలా మంది తమకు వచ్చింది సాధారణ జలుబు, దగ్గే అయినా… అది కరోనా ఎఫెక్టేమో అనుకుంటూ… గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు. అలాంటి వాళ్లను టెస్ట్ చేసి… సాధారణ జలుబే అయితే… రిటర్న్ పంపిస్తున్నారు డాక్టర్లు. ఐతే… ప్రస్తుతం హైదరాబాద్‌లో 9 మందిపై అనుమానాలు ఉన్నాయి. వారిలో ఐదుగురు గాంధీ ఆస్పత్రిలో ఉండగా… మిగతా నలుగురూ ఫీవర్‌ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.