డిప్రెషన్ … దేశవ్యాప్తంగా అన్ని వయస్సులవారు దీనివల్ల ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. వయస్సుతో సంబంధంలేకుండా మనుషులను మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో దీని బారిన పడుతున్నారు. రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి భరోసాగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.
రెండేళ్ల కిందట వెలువడిన జాతీయ మానసిక వైద్య అధ్యయనం ప్రకారం.. మన దేశంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు దాదాపు 10.6 శాతం మంది ఉన్నట్లు అంచనా. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యబృందాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించగా.. 5 లక్షల జనాభాలో ప్రాథమికంగా దాదాపు మూడు శాతం మందిలో వేర్వేరు మానసిక సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో పురుషులు 65 శాతం మంది, మహిళలు 35 శాతం మంది ఉన్నట్లు తేల్చారు. ఓటములు, ఒంటరితనం, పేదరికం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిరుద్యోగం.. ఇలా ఎన్నో కారణాలు మనుషుల్ని డిప్రెషన్‌లోకి నెట్టి ప్రాణాలను హరిస్తున్నాయి.
గ్రామీణులను సైతం పీడిస్తున్న డిప్రెషన్
మారిన జీవనశైలితోపాటు ఒత్తిడి పెరుగుతుండటంతో నగరవాసులనే కాక గ్రామీణప్రాంతాల వారిని సైతం మానసిక రుగ్మతలు వేధిస్తున్నాయి. మానసిక చికిత్సలను గ్రామాలకు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసి అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు చికిత్స కోసం ఏటా రూ.540 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివిధ సంస్థల అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని డిప్రెషన్ బాధితులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా, ప్రాంతీయస్థాయి ఆస్పత్రుల్లోనే కాకుండా ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మానసిక రుగ్మతల పరీక్షలు, చికిత్స, మందులు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
9 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చికిత్స ప్రారంభం
మానసిక వ్యాధులకు చికిత్స తీసుకోవడం మధ్యతరగతి వర్గాలకు మోయలేని భారమవుతోంది. ఇప్పటివరకు నగరాలకే పరిమితమైన మానసిక వైద్య చికిత్సను ఇప్పుడు గ్రామాలకు విస్తరింపచేయాలనితెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. మొదటగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో కార్యాచరణ మొదలుపెట్టి విడతలవారీగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని యోచిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, కరీంనగర్, సిద్దిపేట, వనపర్తి, జగిత్యాల, సంగారెడ్డి, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 353 ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రయోగాత్మకంగా మానసిక వైద్యపరీక్షలు, చికిత్స, మందుల పంపిణీ చేపట్టనున్నది.
ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులు, వైద్యులకు అవసరమైన శిక్షణను ఇప్పటికే అందించారు. మానసిక సమస్యలపై తెలుగులో పుస్తకాలను ముద్రించి ప్రజలకు పంచిపెడుతున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం వారానికోరోజు ఓపీ నిర్వహించనున్నారు. రుగ్మత ఉన్నవారికి అవసరమైన మందులు ఇవ్వడంతోపాటు బాధితుడు, కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నారు.