రష్యా వ్యాక్సిన్ వచ్చేసిందనగానే ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఏకంగా అధ్యక్షుడు పుతిన్ డాటర్ కి ఇమ్యూనిటీ పెరిగిదంటే అందరూ సంబరపడ్డారు. కానీ మరుసటిరోజే పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఏ ప్రాతిపదికన ఏ దశలో ప్రయోగాలు చేశారో చెప్పాలని పరిశోధకులు, వైద్య రంగ నిపుణులు సవాల్ విసిరారు. తడబడ్డ రష్యా వ్యాక్సిన్ రేసులో వెనకడుగు వేసింది. కరోనా వైరస్ బాధిత దేశాల ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. మరిప్పుడు ఏ వ్యాక్సిన్ ఏ దశలో ఉందనేది ఆసక్తికరంగా మారింది.
టీకా ప్రయోగాలపై ఆరా :
కరోనా వ్యాక్సిన్ లు మార్కెట్లోకి వచ్చినా రాష్ట్రాలేవీ తమంతట తాముగా వ్యాక్సిన్ కొనొద్దని కేంద్రం హెచ్చరించింది. వ్యాక్సిన్ ఎడ్మినిస్ట్రేషన్ పై ఏర్పాటుచేసిన నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ తొలి సమావేశంలో రాష్ట్రాలకు స్ట్రిక్ట్ గా సూచనలు చేసింది. మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ 5 తయారైందని, వాడేందుకు అనుమతించాలని రష్యా ప్రకటించిన వెంటనే ఈ భేటీ జరిగింది.
దేశీయంగా పరీక్షల్లో ఉన్న వ్యాక్సిన్లతో పాటు, అంతర్జాతీయంగా సిద్ధమవుతున్న వ్యాక్సిన్ల ప్రయోగాలు, ఆ టీకాలను ఎలా సేకరించాలనే దానిపై చర్చించారు. అంతేకాదు వ్యాక్సిన్ ను భారత దేశంలో పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమయిన నిధుల సమీకరణపై కూడా సమాలోచనలు చేశారు.
మూడు వ్యాక్సిన్లపై భారత్‌లో ప్రయోగాలు :
ప్రపంచవ్యాప్తంగా ఇపుడు 24 వ్యాక్సిన్లు ట్రయల్స్ లో బిజీగా ఉన్నాయి. వాటిలో మూడు వ్యాక్సిన్లపై ఇండియాలో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆక్స్ ఫోర్డ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్, జైడస్ క్యాడిలా జైకోవ్ వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒకవేళ వీటిలో సానుకూల ఫలితాలు వస్తే వాటిని సేకరించి, పంపిణీ చేయడంపై కూడా ఎక్స్ పర్ట్ గ్రూప్ చర్చించిది. వ్యాక్సిన్ వస్తే వాటి సరఫరా కేంద్రీకృతం చేసేందుకు అన్ని రాష్ట్రాలకు సమానంగా అందుబాటులోకి తేవడమే ఈ భేటీల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
నిమ్స్‌లో 32మందికి సెకండ్ డోస్ :
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. భారత్ లో కేసులు పెరిగిపోతుండడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు వాలంటీర్లు ఉత్సాహంగా ముందుకు రావడం శుభపరిణామం అనే చెప్పాలి. కోవ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా హైదరాబాద్ నిమ్స్ లో 32మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.
వీరిలో ఎవరికి ఎలాంటి సైఢ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. పైగా వారిలో ఇమ్యూనిటీ పెరిగినట్టు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల్లో కూడా ట్రయల్స్ ఫలితాలను గమనించి మూడో దశకు వెళ్లాలని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. అటు జైకోవ్ డీ వ్యాక్సిన్ పై కూడా ప్రయోగాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి.
థర్డ్ ఫేజ్‌లో ఆక్స్‌ఫర్డ్, మోడర్నాల ప్రయోగాలు :
ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా, మోడెర్నాలు వ్యాక్సిన్ రేసులో అన్నిటకంటే ముందున్నాయి. ఇవి ఏప్రిల్ లోనే ట్రయల్స్ మొదలెట్టాయి. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ టీకాలు ఇమ్యూనిటీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికి అన్ని సానుకూల ఫలితాలే వచ్చినప్పటికీ.. అన్ని వయసుల వారికి దశల వారీగా ప్రయోగాలు ఎక్కువగా చేయాలని భావిస్తున్నాయి. కీలక దశలు దాటితే వ్యాక్సిన్ సక్సెస్ అయినట్టే. అయితే మరిన్ని దశలు దాటాలంటే కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశముంది.
ఇందులో ఆక్స్‌పర్డ్-ఆస్ట్రాజెనికా వాక్సిన్‌పై పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ వాక్సిన్ ట్రయల్స్‌తో పాటు ఉత్పత్తికి వీటి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఒకవేళ ఆక్స్‌పర్డ్ వాక్సిన్ మార్కెట్లోకి వస్తే వాటిని భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది.
యూకే, అమెరికాతో పాటు జర్మనీ, ఇజ్రాయెల్‌లో కూడా మరో 9వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. భారత్ మాత్రం వీలైనంత త్వరగా కరోనాకి వ్యాక్సిన్లు మార్కెట్ లోకి తేవాలని భావిస్తోంది. అందుకే ఫార్మా కంపెనీలతో వరుసగా సమాశం అవుతోంది.