సమంత పోస్ట్‌పై డాక్టర్ల రియాక్షన్‌ ఎలా ఉన్నా.. గూగుల్‌లో సెర్చ్‌ చేసి సొంత వైద్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

రైస్ తినొద్దని కొందరు.. చపాతీ తింటే మంచిదని మరొకరు. రొట్టే తింటే ఫైబర్ ఉంటుందని ఇంకొందరు. ఉదయాన్నే ఇడ్లీ తినొద్దు.. తౌడు జ్యూస్‌ తాగాలని మరికొందరు..

ఆరోగ్యం కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలే ప్రాణం మీదకు తెస్తున్నాయి. జ్వరం వచ్చినా.. రోజుల తరబడి తలనొచ్చినా.. ఇంకా ఏ హెల్త్ ప్రాబ్లమ్‌ ఉన్నా చాలామందికి లైట్ అయిపోయింది. యూట్యూబ్‌లోనో.. గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఎవరో చెప్పింది విని..జ్యూస్‌లు, కషాయాలు తాగేస్తున్నారు. కరోనా తర్వాత ఎవరుపడితే వాళ్లు డాక్టర్లు అయిపోయారు.

కొత్తగా వచ్చిన మహమ్మారి కాబట్టి కొందరు.. మిరియాలు, పసుపు, ఓమ ఇలా ఏదో ఒకటి నీటిలో వేసుకుని తాగారు. దాంతో కొందరికి.. దగ్గు, జలుబు నుంచి రిలీఫ్ దొరికింది. ఇప్పుడదే వైద్యం అయిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది సజెస్ట్ చేయడం జనాలు వాడేయడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కామన్ అయిపోయింది. వచ్చిన అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ముందుగా ఏవో రెండు ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు.. లేకపోతే సొంతం వైద్యం చేసుకుంటున్నారు..అంతటితో ఆగకుండా పక్కోడికి సలహాలు ఇచ్చేస్తున్నారు కొందరు జనాలు.

తోచిన మెడిసిన్ వాడుతున్నారా?
న్యూరోపతి, న్యాచురోపతి ఇలా ప్రతి దానికో పేరు పెట్టడం తోచిన మెడిసిన్ వాడటం జనాలు అలవాటుగా చేసుకున్నారు. ఇక ఫుడ్ హ్యాబిట్స్ గురించి అయితే చెప్పవసరం లేదు. డైట్‌, హెల్త్ కాన్షియస్‌ పేరుతో బాడీకి ఏం కావాలో.. అసలేం తింటున్నారో కూడా తెలియదు. ఇలా తెలిసీ తెలియక తీసుకునే ఆహారం, సొంత వైద్యం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.

ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ముందుగా డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం చాలా ఇంపార్టెంట్. కానీ అంతకంటే ముందే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఫస్ట్ మెడికల్ షాప్‌కు వెళ్లి ఏదో ట్యాబ్లెట్స్‌ తెచ్చి రెండుమూడ్రోజులు వాడేస్తున్నారు. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్‌కు వెళ్తున్నారు. అంతలోపు రోగం ముదురుతోంది. ప్రాణాల మీదకు వచ్చాక హాస్పిటల్స్‌కు వెళ్లి.. దీర్ఘకాలికంగా బెడ్‌కు పరిమితం అవుతున్నారు. నిర్లక్ష్యం కాస్త ఆపరేషన్లు, డయాలిసిస్‌లు.. రెగ్యులర్‌ ట్రీట్‌మెంట్‌కు దారి తీస్తోంది.

ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు
రైస్ తినొద్దని కొందరు.. చపాతీ తింటే మంచిదని మరొకరు. రొట్టే తింటే ఫైబర్ ఉంటుందని ఇంకొందరు. ఉదయాన్నే ఇడ్లీ తినొద్దు.. తౌడు జ్యూస్‌ తాగాలని మరికొందరు.. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు చెప్పుకుంటూ పోతున్నారు. జనాలు కూడా వాటిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఇక స్వయం ప్రకటిత మేధావులు, డాక్టర్లు ఎక్కువైపోయారు. మిడిమిడి జ్ఞానంతో వైద్య సలహాలు ఇచ్చేవాళ్లు లెక్కలేనంత మంది ఉన్నారు. పెద్దలు చెప్పిన మాట చద్దన్నంమూట అని కొందరు.. తాతమ్మ కథలు అని మరికొందరు.. ఇలాంటి వైద్య సలహాలకు అయితే లెక్కే లేదు.

ఒకరి బాడీకి మరొకరి బాడీకి చాలా తేడా ఉంటుంది. ఏజ్‌, బాడీ వెయిట్‌, రోగ నిరోధక శక్తి, జీర్ణవ్యవస్థను బట్టి ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా రెస్పాండ్ అవుతుంది. అందరికీ ఒకే రకమైన ఫుడ్ పడాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. అందరికీ అన్ని రకాల మెడిసిన్ కూడా పడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇవి తినొద్దు..అవి తినొద్దు.. తాము చెప్పినట్లు తింటే అంతా సెట్ అవుతుందని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది.

మనిషి శరీరం ముందుగా మనం చెప్పినట్లు వింటుంది. ఆ తర్వాత శరీరం చెప్పినట్లు మనం వినాలి. లేకపోతే అంతే సంగతులు. తినే ఆహార అలవాట్లు మారకుండా.. ఎవరు పడితే వాళ్లు చెప్పిన కషాయాలు, జ్యూస్‌లు, మెడిసిన్ వాడుకుంటూ పోతే చివరకు అనారోగ్యమే మిగులుతుంది. అందుకే ఆరోగ్యంతో గేమ్‌లు ఆడొద్దు. హెల్త్‌ను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది.

ఈ క్రమంలో ఇప్పుడు సినీ నటి సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ సంచలనంగా మారింది. మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సామ్ అప్పుడప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ఇన్‌ స్టాలో షేర్ చేస్తుంది. ఇప్పుడు సమంత చేసిన పోస్ట్‌పై మాత్రం వైద్య వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చెయ్యండని చెప్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది సమంత. ఈ పోస్ట్‌పై డాక్టర్లు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఎలాంటి అవగాహన లేకుండా అలా పోస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Also Read: న‌టి స‌మంత హెల్త్ టిప్‌.. ఫైర్ అవుతున్న డాక్టర్స్.. నిరక్షరాస్యురాలు..

సమంత చెప్పిందే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదంటూ ఓ డాక్టర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్‌స్టేబుల్ రసాయనం. అది నీరును ఆక్సిజన్‌గా మారుస్తుందని.. వైరల్ ఇన్ఫెక్షన్‌ తగ్గించకపోగా.. ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. ఆమె చెప్పినట్లు చేస్తే న్యుమోనియా, ఏక్యూట్ రెస్పిటేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కు గానీ దారి తీస్తుందని ఓ డాక్టర్ చెబితే.. సమంత సలహాలు పాటిస్తే డైరెక్ట్‌గా చావేనంటూ మరో వైద్యుడు ట్విటర్‌లో రాసుకొచ్చారు.

సమంత పోస్ట్ డాక్టర్ల రియాక్షన్‌ ఎలా ఉన్నా..సొంత వైద్యం అయితే చాలా ప్రమాదకరం. తక్కువ కాస్ట్‌తో చూసే ఎలాంటి అనుభవం లేని డాక్టర్లు..కనీస వైద్య పరిజ్ఞానం లేనివాళ్ల దగ్గరకు వెళ్లి అనారోగ్యం పాలవ్వొద్దని సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్‌. ఆరోగ్యాన్ని మించి ఆస్తి లేదని.. హెల్త్‌ను కాపాడుకుంటే అన్ని ఆస్తులు ఉన్నట్లేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

Urology Conference : దేశంలోనే అతిపెద్ద యూరాల‌జీ స‌ద‌స్సు.. ఈ నెల 6 నుంచి హైదరాబాద్ వేదికగా ఏఐఎన్‌యూ రెండో ఎడిషన్!

 

ట్రెండింగ్ వార్తలు