తెలంగాణలో ఒక్కరోజే 10 పాజిటివ్.. 59కి చేరిన కేసులు: కేసీఆర్

  • Publish Date - March 27, 2020 / 11:26 AM IST

తెలంగాణలో తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తెలంగాణలో 59కి కరోనా కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒకరికి నయమైందన్నారు. 58 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్‌కు మందు లేదని, వ్యాప్తిని నివారించడమే పెద్ద ముందు అని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 20వేల మంది క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు.

అమెరికాలో ఒక న్యూయార్క్‌ రాష్ట్రంలో 11వేల వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. అక్కడే ఇప్పుడు 30వేల వరకు వెంటిలేటర్లు అవసరం ఉన్నాయని చెప్పారు. వెంటిలేటర్లు సమకూర్చలేక అమెరికా ప్రభుత్వం ఆగమవుతోందని అన్నారు. మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలన్న దానిపై తీవ్రంగా చర్చించామన్నారు. లాక్ డౌన్ చేయకుండా ఉంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉండేవన్నారు. 

మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టన్స్ మాత్రమేనని, అందరూ సామాజిక దూరం, స్వయం నియంత్రణ తప్పక పాటించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఐసోలేషన్ వార్డులో 11వేల మంది ఉండవచ్చునని చెప్పారు. 1400 ఐసీయూ బెడ్స్ గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

500 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇచ్చామన్నారు. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇటలీ, స్పెయిన్ స్థాయిలో వస్తే దేశంలో 20 కోట్లమందికి కరోనా సోకే ప్రమాదం ఉందని కేసీఆర్ చెప్పారు. పూర్తిస్థాయిలో కరోనా వ్యాపించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యావత్ ప్రపంచమే యుద్ధంలో పాల్గొంటోందని కేసీఆర్ అన్నారు. 

60వేల మంది వరకు పాజిటివ్ కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సన్నద్ధమయ్యామని కేసీఆర్ చెప్పారు. 12,400 మందికి ఏకకాలంలో ట్రీట్ మెంట్ ఇవ్వగల స్థాయిలో ఉన్నామని తెలిపారు. ప్రజలు ఏ దశలో కూడా నిర్లక్ష్యం కానీ, అలసత్వం కానీ వహించొద్దని సూచించారు. మనం భయంకరమైన మహమ్మారితో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సహకరిస్తే తాము చేయాల్సిన పనులు వేరే ఉన్నాయన్నారు.

ఒక్క మనిషిని కూడా ఉపవాసం ఉండనివ్వమని కేసీఆర్ స్పష్టం చేశారు. 50 లక్షల ఎకరాల్లో పంటలున్నాయని అన్నారు. పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఎస్ఆర్ఎస్పీ, కాళేశ్వరం, నాగార్జున సాగర్, జూరాల ఆయకట్టు కింద ఏప్రిల్ 10 వరకు పొలాలకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగించాలన్నారు. రైతులు అనవసరమైన మానసిక ఒత్తిడికి గురికావద్దని, ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు.

Also Read | ఎవర్ని బతికించాలో మీరే తేల్చుకోమంటున్న డాక్టర్లు