తెలంగాణలో రెండవిడత పరిషత్ పోరు స్టార్ట్ అయ్యింది. 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 10 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మే 10వ తేదీ శుక్రవారం రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై..218 ఎంపీటీసీ స్థానాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లుగా గుర్తించిన 218 స్థానాల్లో మాత్రం సాయంత్రం 4గంటలకే ముగుస్తుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మినహా 31 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.
రెండో విడుతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిల్లో ఒక ఎంపీటీసీ మినహా అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,146 మంది, 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది బరిలో ఉన్నారు. మొత్తం 10,371 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు భద్రతను కల్పించారు.