ఆర్టీసీ సమ్మె 9వ రోజు : ఇబ్బందులు పడుతున్న ప్రజలు

  • Publish Date - October 13, 2019 / 01:48 AM IST

ఆర్టీసీ సమ్మె 9వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. దీంతో రవాణా సౌకర్యం లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఇటు కార్మిక సంఘాలు, అటు ప్రభుత్వం ఎవరికి వారుగా పట్టుదలతో ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె విరమించేదిలేదని  కార్మిక సంఘాలు తెగేసి చెబుతుంటే.. విలీనం ప్రసక్తేలేదని సర్కారుకు కూడా తేల్చి చెప్పింది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని, ఇది ముగిసిన అధ్యాయమని తెలిపింది.

ఆర్టీసీ బస్‌లన్నింటినీ నడిపేందుకు పూర్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీకి 3 వేల 303 కోట్ల రూపాయల సహాయం చేసిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలు కూడా పట్టుదలతో ఉన్నాయి. సమ్మెను ఉధృతం చేసే క్రమంలో ఈనెల 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది.

బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని కార్మిక నాయకులు కోరారు. అప్పటివరకూ రోజుకో తరహా ఆందోళనలతో వేడి పెంచాలని జేఏసీ పిలుపు ఇచ్చింది. ఇదిలా ఉంటే..బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా..అవి సరిపడా లేకపోవడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా ఆటోలు, క్యాబ్‌లు ఇతర వాహనాలు డబ్బులను అమాంతం పెంచేశాయి. దీంతో సామాన్యుడి జేబు గుల్లవుతోంది. 
Read More : మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో : కవలలకు జన్మనిచ్చిన 52ఏళ్ల మహిళ