వేణుమాధవ్.. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి సినీ రంగం ప్రవేశంతో ఓ వెలుగు వెలిగారు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే. వేణుమాధవ్ జీవితంలో రాజకీయ కోణం కూడా చాలా ముఖ్యమైనది. తెలుగుదేశం పార్టీతో అనుబంధం తుదిశ్వాస వరకు కంటిన్యూ చేశారు.
వేణుమాధవ్ చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసేవాడు. అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు వేణుమాధవ్ చేసిన వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్ చూసి భువనగిరిలో జరుగుతున్న టీడీపీ సమావేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాడులో ఆయన ప్రదర్శన ఇచ్చారు. అది ఎన్టీఆర్‌కు నచ్చటంతో ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ వేణుమాధవ్‌ను మొదట హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు. అనంతరం టీడీఎల్పీలోనూ, నాచారం ఆశ్రమం, ఎన్టీఆర్ భవన్ లోనూ వివిధ విభాగాల్లో పని చేశారు వేణుమాధవ్.
అలా మిమిక్రీ ఆర్టిస్టుగా తన టాలెంట్ ను మొదట గుర్తించింది తెలుగుదేశం పార్టీనే. ఈయన టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేసే వారు. ఇలా సినిమాలు చేస్తూనే టీడీపీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఫీక్‌లో ఉంది. సభలు, సమావేశాలు, జన్మభూమి లాంటి ఎన్నో ప్రచార కార్యక్రమాలను చేపట్టారు చంద్రబాబు. దీంతో వేణుమాధవ్ పార్టీ వ్యవహారాల్లో మరింత బిజీ అయ్యారు. అదే సమయంలో వచ్చిన సినీ అవకాశాలను కూడా అందిపుచ్చుకుని.. పార్టీతోనూ అనుబంధం కొనసాగించారు. సినిమాలు చేస్తూనే.. తెలుగుదేశం పార్టీతో నడిచారు. ఆ విధంగా టీడీపీ పార్టీ నేతలకు మరింత దగ్గర అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారానికి వేణుమాధవ్ ను తీసుకెళ్లేవారు టీడీపీ అభ్యర్థులు.
2014లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. చివరి వరకు టికెట్ వస్తుందని భావించారు. అయితే చివరి నిమిషంలో పార్టీ టికెట్ నిరాకరించింది. ఆ సమయంలోనూ.. టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. 2017లో నంధ్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరపున ప్రచారం చేశారు. ఎమ్మెల్యే కావాలనే తన కోరిక అని చాలాసార్లు చెబుతూ వచ్చారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే తుది శ్వాస విడిచారు వేణుమాధవ్. అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు టీడీపీ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది.