తెలంగాణలోనే ఫస్ట్: పాపిలాన్ పట్టేస్తుంది.. 5సెకన్లలో నేరస్థులు దొరికేస్తారు

  • Publish Date - October 23, 2019 / 03:01 AM IST

చోరీలు, దోపిడీలు, గొలుసు దొంగతనాలు ఇటీవలికాలంలో పెరిగుతున్నాయి. ఈ క్రమంలోనే పాత దొంగలపై కన్నేసి.. వారిని పట్టుకునేందుకు సాంకేతికతను వాడుకుంటున్నారు పోలీసులు. అంతేకాదు తప్పు చేసి బయట తిరిగుతూ తప్పించుకునేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది పాపిలాన్. నేరం చేసిన వారి వేలిముద్రల ఆధారంగా పాత నేరస్థులను గుర్తించే లైవ్‌స్కానర్లతో కూడిన ‘పాపిలాన్‌’ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది పోలీసు శాఖ. గతంలో పాత నేరస్థులు బయట సంచరిస్తున్నా వారిని గుర్తించి పట్టుకునే అవకాశాలు తక్కువ. అయితే పాపిలన్ పరిజ్ఞానంతో ఒకవేళ పాత నేరస్థుడు రహదారిపై కనిపిస్తే వెంటనే సాంకేతికంగా గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. 

తెలంగాణ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ) లోని ఫింగర్‌ప్రింట్‌ విభాగం (ఎఫ్‌పీబీ) సమకూర్చుకున్న ‘పాపిలాన్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌’ నేరగాళ్లను గుర్తించే ప్రక్రియలో అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. 2017లో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పాపిలాన్‌-ఏఎఫ్‌ఐఎస్‌(ఆటోమేటెడ్‌ ఫింగర్‌ అండ్‌ పామ్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌) ప్రపంచస్థాయి సాంకేతికత రాష్ట్ర పోలీసులకు నేరస్థులను పట్టుకోవడంలో కీలకంగా మారింది. అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్‌ మాత్రమే వినియోగించే ఈ టెక్నాలజీ మన పోలీసులు ఉపయోగిస్తున్నారు. దీంతో నేరస్థులు తప్పించుకోలేరు అని పోలీసులు చెబుతున్నారు.

భారత్‌లో ఇలాంటి సాంకేతికత కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణనే. దొంగతనాలు, దోపిడీలు జరిగిన స్థలాల్లో సేకరించిన వేలిముద్రలను విశ్లేషించి అది ఎవరు చేశారో గుర్తించి క్షణాల్లో పోలీసులకు చెబుతుంది పాపిలాన్. అనుమానితుల నేరచరిత్ర మొత్తం 5 నుంచి 10 సెకన్లలో అధికారి ట్యాబ్లెట్‌ పీసీ మీద ప్రత్యక్షం అవుతుంది. దీంతో నేరస్థులను పట్టుకోవడం ఈజీ అయిపోయింది.

ఇప్పటివరకు మొత్తం 1,345 దొంగతనాలు, దోపిడీ కేసుల్లో నేరస్తులను గుర్తించి వారి నుంచి రూ.19.49 కోట్లని స్వాధీనం చేసుకోవడంలో పాపిలాన్ కీలకంగా పనిచేసింది. 72 కేసుల్లో గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో పాపిలాన్ ఉపయోగపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరిస్తున్న 8,850 మంది నేరస్థులను గుర్తించింది. అలాగే నేరచరిత్రను దాచి కొత్త పాస్‌పోర్టు పొందాలలని ట్రై చేసిన 60మందిని గుర్తించింది. పేరు మార్చుకుని తిరుగుతున్న మరో 49 మంది నేరగాళ్లను కూడా గుర్తించింది. పలు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ కేసులను పాపిలాన్‌  సాయంతో నేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఆస్కారముంటుంది పోలీసులు చెబుతున్నారు.