నేతల్లో ఆశలు : ఆ తర్వాతే.. నామినేటెడ్ పదవులు?

  • Publish Date - December 20, 2019 / 12:03 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం.. రెండో విడత అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో నేతలకు నామినేటెడ్ పదవుల తాయిళాలు అందుతాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విడత ముఖ్యమంత్రి కేసీఆర్ అతి కొద్దిమంది నేతలకే పదవులు కట్టబెట్టారు. మరి కొంతమంది నేతలకు పదవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో నామినేటెడ్ పదవులపై పలుమార్లు చర్చలు జరగడంతో నేతలంతా త్వరలోనే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశలు పెంచుకున్నారట. సెంటిమెంట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ ఇప్పట్లో కొత్త పదవులు భర్తీ చేసే అవకాశం లేదని నేతలు అంటున్నారు. 

కొత్త పదవులు దక్కేనా? :
ధనుర్మాసం మొదలు కావడంతో ఎలాంటి శుభకార్యాలు చేపట్టే ఆనవాయితీ గులాబీ పార్టీలో లేదు. దీంతో పార్టీ నేతలకు కూడా కొత్తగా పదవులు దక్కే అవకాశం లేదనే చర్చ అధికార పార్టీలో మొదలైంది. దీనికితోడు తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ తర్వాతే పదవుల భర్తీ ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. జనవరి నెలాఖరుకు మున్సిపల్ ఎన్నికలు పూర్తయితే ఆ తర్వాత పదవుల జాతర మొదలయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆశిస్తున్నారట. ఎన్నికల ఫలితాలను బట్టి కూడా ప్రాధాన్యం ఉంటుందన్న సంకేతాలు పార్టీ కీలక నేతలు ఇస్తున్నారు. 

మున్సిపల్ ఎన్నికలతో లింక్ :
ఇప్పటికే ఏడాది పాలన పూర్తి కావడంతో పదవుల భర్తీ చేపడితే పెద్ద ఎత్తున నేతలకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీలో కీలక కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఎమ్మెల్యేలకే దక్కే అవకాశాలున్నాయి. మెజారిటీ నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఉద్యమకారులకు ఈ విడత ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. మొత్తమ్మీద నామినేటెడ్‌ పదవులు దక్కించుకోవడానికి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు లింకు పెట్టడం ద్వారా కేసీఆర్‌ భలే ఫిటింగ్‌ పెట్టారని పార్టీ కేడర్‌ అంటోంది. ఇప్పుడు విభేదాలు పక్కన పెట్టి పార్టీని గెలిపించుకుంటేనే తమకు పదవులు దక్కుతాయనే ఉద్దేశంతో నేతలంతా కష్టపడి పని చేస్తారన్నది కేసీఆర్‌ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు