తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సెగ రాజేస్తోంది. 16 సీట్లే లక్ష్యంగా గులాబీ దళం ముందుకు పోతుంటే..ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. TRS అధినేత కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచార కదనరంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయన కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి మోడీలు ఏప్రిల్ 1న రాష్ట్రానికి రానున్నారు. ఇరువురు అధినేతలు వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఏప్రిల్ 1వ తేదీన మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో జరిగే సభలలో రాహుల్ పాల్గొంటారు. ఏప్రిల్ 1న జహీరాబాద్, నాగర్ కర్నూలు, నల్గొండ లోక్ సభ స్థానాల్లో జరిగే ఎన్నికల సభలలో పాల్గొంటారు రాహుల్. మధ్యాహ్నం 12గంటలకు జహీరాబాద్ బహిరంగసభ, 2 గంటలకు నాగర్ కర్నూలు సెగ్మెంట్ వనపర్తిలో, సాయంత్రం 4గంటలకు నల్గొండ లోక్ సభ స్థానం పరిధిలోని హుజూర్ నగర్ ఎన్నికల సభలలో పాల్గొంటారు. రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జనసమీకరణలో నేతలు బిజీ బిజీగా ఉన్నారు.
మరోవైపు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. మార్చి 29న మహబూబ్ నగర్‌లో జరిగే బహిరంగసభతో పాటు ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభల్లో మోడీ పాల్గొంటారని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీన కరీంనగర్, వరంగల్‌లో జరిగే బహిరంగసభల్లో షా పాల్గొంటారు. మోడీ, షా సభలను సక్సెస్ చేసేందుకు కమళనాథులు ప్రయత్నిస్తున్నారు. ఇరువురు నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.