తెలంగాణ వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రజలకు అత్యవసర సరుకులకు సంబంధించి అంశాలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనుంది. కరోనా నియంత్రణ చర్యలపై కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అత్యవసర సరుకులను తెచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు.
ఈ సందర్భంగా వైన్స్ షాపుల సంగతి ఏంటి? అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా.. కేసీఆర్.. మీకు అవసరం ఉందా? అంటూ చమత్కరించారు. 100 శాతం వైన్స్ షాపులు కూడా బంద్ చేస్తామని చెప్పారు. ఇంతకుముందే బార్లు, పబ్స్ మూసివేశామని, రాష్ట్రంలో అన్ని వైన్ షాపులన్నీ మూసివేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
విద్యుత్, వైద్యం, పోలీసు తదితర అత్యవసర శాఖలు 100 శాతం పనిచేస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సరిహద్దులను మూసివేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులను రాష్ట్రంలోకి రానివ్వమన్నారు. 100 శాతం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నిలిపివేస్తామని చెప్పారు.
ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు కూడా నడవని అన్నారు. వారంపాటు జాగ్రత్తగా ఉంటే కరోనా నుంచి బయటపడొచ్చునని తెలిపారు. ప్రజలెవ్వరూ రోడ్డుపైకి రావొద్దని, ఎవరిని అనుమతించమని చెప్పారు. ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేమన్నారు.
అత్యవసర సేవల సంస్థల్లో పాలు, మెడికల్ షాప్స్, ఆస్పత్రులు, ఫైర్ సర్వీసెస్, వాటర్, విద్యుత్, గ్యాస్, పెట్రోల్ బంకులు ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్థానికంగా కరోనా వైరస్ అంత వేగంగా విస్తరించడం లేదన్నారు. ఐదుగురికి మించి గుమిగూడడానికి వీలు లేదన్నారు. కరోనా వల్ల ఇటలీ భయంకరంగా దెబ్బతిన్నదని, అలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే స్వయం సంరక్షణ పాటించాలని కేసీఆర్ సూచించారు.
See Also | తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం : కేసీఆర్