మహమ్మారిపై పోరాటం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు.. చేతల్లో చేయాల్సినంత పని కచ్చితంగా ఉంటుంది. అందులోనూ ప్రజల ప్రాణాలతో చలగాటమైన విషయం అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు.. ప్రభుత్వానికి కూడా వణుకు తప్పదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా మహమ్మారిపై చాలావరకు జయిస్తుంది. ఇందుకు కారణం.. ప్రమాదం వచ్చాక చర్యలు చేపట్టడం కంటే ఒక అడుగు ముందే ప్రమాదాన్ని పసిగట్టి చర్యలు తీసుకోవడం.
ముందుగా దాని తీవ్రతను అంచనా వేయడం.. అనుకున్నదానికన్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండటం.. కావల్సిన వాటిని చేసుకోవడం.. అందుబాటులో లేనివాటిని తెచ్చుకోవడం.. రంగంలోకి దిగి కరోనా వైరస్‌పై రణానికి సిద్ధం అయింది ప్రభుత్వం. అందులో భాగంగానే తప్పని కొన్ని కీలక నిర్ణయాలను వేగంగా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సమస్యాత్మక దేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా వికారాబాద్ పంపించి, పరీక్షలు చేయించి అక్కడే గెస్ట్ హౌస్‌లలో వారిని ఉంచుతుంది.
సిటీలోకి ఆ వైరస్ ఉన్న వ్యక్తి వస్తే ప్రమాదమే.. అందుకే అసలు అడుగు పెట్టకుండా గట్టి చర్యలే చేపట్టింది. అలాగే నెలాఖరు వరకూ థియేటర్లు, విద్యాసంస్థలు, మాల్స్ మూసివేయాలనే నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వం ఊర్ల నుంచి నగరానికి వచ్చి ఉద్యోగాలు వెతుక్కొనేవారిని కూడా కొన్నిరోజులు ఇళ్లకు పోవాలని, సొంత గ్రామాల్లో ఉండాలని చెబుతుంది ప్రభుత్వం. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత తిరిగిరావాలనేది అధికారుల సూచన.
అందులో భాగంగానే అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్‌లోని హాస్టళ్లను మూసి వేయించాలని అధికారులు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హాస్టళ్ల నిర్వాహకులతో పోలీసులు అధికారులు, డీసీ గీతారాధిక, కార్పొరేటర్ శేషుకుమారి సమావేశం అయ్యారు. ఈ నెల 31 వరకు హాస్టళ్లను మూసివేయాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. హాస్టళ్లు ఖాళీ చేయించి పంపించాలని కోరుతున్నారు. కొన్ని ప్రత్యామ్నయ ఏర్పాట్లతో క్రౌడ్ తగ్గిస్తే కానీ, పరిస్థితి అదుపులోకి రాదు అని అధికారులు చెబుతున్న మాట.
ఇప్పటికే హైదరాబాద్ యూనివర్శిటీ, ఉస్మానియా హాస్టల్స్ ఖాళీ చేయాలని అధికారులు విద్యార్థులకు ఆదేశాలు జారీచేశారు. ఏ ఒక్కరు కూడా హాస్టల్‌లో ఉండటానికి వీలు లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇక ఉద్యోగులు అయితే అవకాశం ఉన్న ప్రతి ఐటీ ఉద్యోగిని ఇళ్ల నుంచే పని చేయించుకోవాలని ఐటీ సంస్థలకు సూచిస్తుంది ప్రభుత్వం.