దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరుకోవడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే అక్కడి పరిస్థితులపై రాజకీయ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ కూడా వస్తుంది. లేటెస్ట్‌గా ఇదే విషయమై మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నాయకులు సీహెచ్. విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. డా. బీఆర్. అంబేడ్కర్ కోరుకున్నట్లుగా బహుశా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని ప్రస్తుతం ఢిల్లిలో పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగు వర్సిటీలో యువకళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో డా.శ్రీధర్‌రెడ్డి రచించిన ‘శ్రీధర్ కవితా ప్రస్థానం’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంధర్భంగా మళ్లీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుకోవడానికి ప్రయత్నం జరగాలని విద్యాసాగర్ రావు అభిలషించారు. ఇదే సమయంలో దేశ రెండవ రాజధాని హైదరాబాద్ అవుతుందేమో అని అన్నారు. అయితే బీజేపీలో నాయకునిగా ఉన్న విద్యా సాగర్ రావు ఈ ప్రకటన చేయడంతో అటువంటి ఆలోచనలో కేంద్రం ఉందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.