ఆయారాం..గయారాం : అంతిమ లక్ష్యం టికెట్ సాధించడమే

  • Publish Date - March 23, 2019 / 12:59 PM IST

ఎప్పుడొచ్చామన్నది కాదు.. టికెట్ దొరికిందా లేదా అన్నదే పాయింట్. ఇదే ఇప్పుడు ట్రెండ్. పొద్దున్నే ఓ పార్టీ.. మధ్యాహ్నానికి మరో కండువా…సాయంత్రం తిరిగే సరికి టికెట్. ఎన్ని పార్టీలు తిరిగామన్నది కాదు.. కండువా ఏదన్నది కూడా ముఖ్యం కాదు. అంతిమ లక్ష్యం టికెట్ సాధించడమే. ఇదే సూత్రాన్ని ఫాలో అయిన కొందరు నేతలు జాక్‌పాక్ కొట్టేసారు.
Read Also : అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్

ఆయారాం గయారాం.. హిందీ పదమే అయినా.. చాలా ఫేమస్ పదం ఇది. 1967లో హర్యానా కాంగ్రెస్‌కు చెందిన గయాలాల్ అనే నేత.. పార్టీ మారిపోయారు. కానీ.. గోడకు కొట్టిన బంతిలా వెంటనే కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. కానీ సాయంత్రం అయ్యేసరికి యునైటెడ్ ఫ్రంట్‌లో చేరిపోయారు. అంతే.. అప్పటి నుంచి ఆయన పేరు బాగా పాపులర్ అయింది. అప్పట్నుంచే పార్టీలు మారే వారిని ఆయారాం గయారాం అని పిలవడం మొదలైంది.

TRS : –
టీఆర్ఎస్‌ కొందరు సిట్టింగులకు టికెట్ ఇవ్వకుండా చర్చకు తెరలేపింది. మధ్యాహ్నం పార్టీలో చేరిన వారికి.. సాయంత్రం అయ్యే సరికి టికెట్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీడీపీ నుంచి పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు.. గులాబీ కండువా కప్పుకున్న కొన్ని గంటల్లోనే టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్. అటు నల్లగొండ ఎంపి టికెట్ కూడా వేమిరెడ్డి నర్సింహారెడ్డి కేటాయించింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుండి పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ జితేంద‌ర్ రెడ్డిని కాద‌ని మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చింది గులాబీ పార్టీ. పెద్దపల్లి టికెట్ వెంకటేశ్‌ నేతకానికిచ్చేశారు. అప్పటి వరకు టికెట్ ఆశించిన నేతలకు నిరాశే మిగిలింది. ఉద‌యం పార్టీలో చేరిన నేతలు రాత్రయ్యే సరికి బీ ఫాం పొందడం పార్టీలో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

BJP :-
బీజేపీలోనూ ఇలాంటి సీనే కనిపించింది. కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కురాలిగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరడం..ఆమెకు మహబూబ్‌నగర్ టికెట్ కేటాయించింది. టికెట్ ఆశించన శాంతకుమార్‌కు నిరాశే ఎదురైంది. 

Congress : – 
కాంగ్రెస్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేరిన గాలి అనిల్‌కుమార్‌కు కేటాయించింది. టీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చేవెళ్ల టికెట్ కేటాయించింది. మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు పెద్దపల్లి టికెట్ ఇచ్చింది. ఇటీవలే పార్టీలో చేరిన దొమ్మాటి సాంబయ్య వరంగల్ టికెట్ దక్కించుకున్నారు. 
చివ‌రి నిమిషంలో పార్టీ మారిన నేత‌లు.. టిక్కెట్లు తెచ్చుకొని ల‌క్కీ ఫెలోస్‌గా మారిపోయారు. ఇంకా నామినేషన్ల దాఖలుకు ఒక రోజు గడువుంది కాబట్టి.. ఆలోపు ఇంకా ఎందరు నేతలు పార్టీ మారుతారో.. చూడాలి. 
Read Also : తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్క ఆంధ్రా కుటుంబాన్ని చూపించు : పవన్‌కు పోసాని సవాల్