తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. నల్గొండలో కుంభవృష్టి, హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం పడింది. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం, సెప్టెంబర్ 19వ తేదీ గురువారం కూడా అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కోస్తాంధ్ర తీరానికి దగ్గరలోని బంగాళాఖాతంలో 7.6 కి.మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు.
నల్గొండలో 6 గంటల్లో 200.8 మిలిమీటర్ల వర్షం కురిసింది. గత 119 ఏళ్ల చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వర్షం పడడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 నుంచి 11 గంటలకే ఈ స్థాయి వర్షం పడింది. ఏపీలో కూడా వానలు దంచి కొడుతున్నాయి. కడప, కర్నూలు జిల్లాలో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కడప జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పదేళ్ల కాలంలో కురవని వర్షాలు ఈసారి పడ్డాయి. రెండు మూడు రోజులు కురుస్తున్న వర్షాలతో పొలాలు నీటమునిగాయి. పంటలు నీటిలో మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చేస్తున్న హెచ్చరికలు.. జనాల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షం కర్నూలు జిల్లాను ముంచెత్తుతోంది. ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని పంచలింగాలు పూర్తిగా మునిగిపోయాయి. మహనంది క్షేత్రం చుట్టూ నీరు ప్రవహిస్తుంది. ఈ సీజన్‌లోనే అధిక శాతాన్ని నమోదు చేసింది.