చాపకింద నీరులా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల క్యూలు.
131 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు.
హైదరాబాద్ : బీ అలర్ట్..నగర వాసులారా…వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతోంది..చలికాలంలో వానలు కురుస్తున్నాయి. రాత్రి వేళల్లో చలి గజ గజ అనిపిస్తోంది. ఈ సమయంలోనే నేనున్నానంటూ..స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కేసులు నమోదవువుతున్నాయంట. మూడు వారాల్లో 1,170 మంది నమూనాలు సేకరిస్తే..అందులో 131 మందికి పాజిటివ్ ఉందని తేలింది. ఒక్క హైదరాబాద్‌లో 47 కేసులు నమోదయ్యాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్ (ఐపీఎం)లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
చలి తీవ్రత…ఉదయం మంచు కురుస్తుండడంతో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రోగులు క్యూలు కడుతున్నారు. అయితే..స్వైన్ ఫ్లూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. కానీ…వ్యాధి సోకకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తోంది.
గతేడాది జనవరి నుండి ఇప్పటి వరకు ఫ్లూ వ్యాధి బారిన పడి ఉస్మానియా హాస్పిటల్‌లో 228 మంది చేరగా పరీక్షలు జరిపితే..అందులో 38మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇప్పటి వరకు 10 మంది కన్నుమూశారు.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే మధుమేహ వ్యాధి గ్రస్తులు, గర్భిణీలు, వృద్దులు, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు…వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వైన్ ఫ్లూలో జలుబు, దగ్గు, ముక్కు కారడం…101, 102 డిగ్రీల జ్వరం..ఒళ్లు నొప్పులు, విరేచానాలు వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి బారిన పడిన వారు తుమ్మినా..దగ్గినా…తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు..కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.