ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అంటున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి ఆజ్యం పోసేలా పాకిస్తాన్ ప్రధాని సహా, మంత్రులు, అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాటలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడారు.
యుద్ధం వస్తే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచపటంలో ఉండదంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జేఎన్టీయూలో ఆర్టికల్ 370 మీద జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ కు ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు.
జవహర్ లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ఏర్పాటు చేశారని, దాని వల్ల 42 వేల మంది చనిపోయారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆర్టికల్ 370 కారణంగానే పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయని, దేశం కోసం ఎటువంటి త్యాగం చేయడానికి అయినా కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, యుద్ధమంటూ వస్తే పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్నారు.