వర్మపై బీజేపీ సీరియస్: సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిక

  • Published By: vamsi ,Published On : October 29, 2019 / 03:45 PM IST
వర్మపై బీజేపీ సీరియస్: సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిక

Updated On : October 29, 2019 / 3:45 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘కమ్మరాజ్యంలోకి కడప రెడ్లు’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజు నుంచి సినిమాపై పలు పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సినిమాపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేష్‌ నాయుడు సెన్సార్‌ బోర్డు సభ్యులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు నింపేలా సినిమా టైటిల్‌ ఉందంటూ హైదరాబాద్‌లోని రీజినల్‌ సెన్సార్‌ బోర్డులో కూడా కంప్లైంట్ చేశారు.

కథను క్షుణంగా పరిశీలించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు రమేష్ నాయుడు. కేవలం సంచలనాలు, డబ్బులు కోసం కకృత్తి పడి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి టైటిళ్లు పెడుతున్నారంటూ ఆయన అన్నారు.

ఇదే సమయంలో సామాజిక స్పృహ లేకుండా సినిమాలు తీయొద్దంటూ వర్మకు సూచించారు. టైటిల్ కూడా మార్చాలని, లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని రమేష్ నాయుడు హెచ్చరించారు.