టికెట్ టికెట్ ప్లీజ్ : ఆర్టీసీలో చెల్లని బస్ పాస్‌లు!

  • Publish Date - October 6, 2019 / 07:12 AM IST

టికెట్ టికెట్ ప్లీజ్..బస్ పాస్..ఉంది..అది చెల్లదు..ఎందుకు చెల్లదు..పాస్ గడువు ముగియడానికి ఇంకా చాలా రోజులు ఉంది..అవన్నీ తెల్వదు సార్..పైసలు ఇవ్వాల్సిందే..లేకపోతే దిగిపోండి..ఇది ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తున్న సీన్లు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లను, కండక్టర్లను నియమించి..నగరంలో బస్సులను తిప్పుతున్న సంగతి తెలిసిందే.

కానీ బస్ పాస్‌లు చెల్లవని చెప్పడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు ప్రయాణీకులు. రూ. 10 నుంచి మొదలుకొని రూ. 20 వసూలు చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. తమకు బస్ పాస్‌లు ఉన్నా..ఛార్జీలు పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందంటున్నారు. ఒక్కో బస్సులో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తాను ఇప్పుడే ఒక బస్సుల్లో వచ్చానని..అందులో బస్ పాస్‌కు చెల్లిందని..టెంపరరీగా నియమించిన కండక్టర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. తమతో వాగ్వాదం చేయవద్దని..తమకు అనుమతినివ్వవద్దని చెప్పడంతో తాము ఇలా చేయాల్సి వస్తోందంటున్నారు ఆ కండక్టర్లు. 

తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ..ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అక్టోబర్ 05వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరాలని ఫైనల్ వార్నింగ్ జారీ చేసింది. అయినా కూడా కార్మికులు బేఖాతర్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో తాత్కాలిక నియామకాలను చేపట్టింది. రోజుకు డ్రైవర్‌కు రూ. 1500, కండక్టర్‌కు రూ.1000 వెల్లించి…బస్సులను నడుపుతోంది. 

అక్టోబర్ 05వ తేదీన సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా నగరంలో ఉన్న ప్రజలు ఆఫీసులు, ప్రైవేటు జాబ్స్ చేసే వారు, ఇతరత్రా పనులపై వెళ్లే వారు ఇక్కట్లకు గురయ్యారు. మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో ఆ రైళ్లు కిక్కిరిసిపోయాయి. సమ్మెను ప్రైవేటు వాహనదారులు క్యాష్ చేసుకున్నారు. అమాంతం ధరలు పెంచేశారు. దీనితో జేబులు గులయ్యాయి. ప్రస్తుతం తిప్పుతున్న ఆర్టీసీ బస్సుల్లో బస్ పాస్‌లకు అనుమతినివ్వాలని ప్రయాణీకులు కోరుతున్నారు. 
Read More : రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె…మెట్రో ఫుల్