Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా కొట్టింది. టైరు పేలడంతో కారు పల్టీ కొట్టింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే కేబుల్ బ్రిడ్జిని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్ బ్లాస్ట్ కావడంతో పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బోల్తా పడిన కారు ట్రాఫిక్ పోలీసులు సాయంతో అక్కడ నుంచి తరలించారు.
దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి అయిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సెప్టెంబర్ 25న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లాక్‌డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సందర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి.
ప్రారంభమైనప్పటి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ బ్రిడ్జ్ మీదకు జనం ఎగబడుతున్నారు. ఫొటోలు, సెల్పీల కోసం పెద్ద ఎత్తున వస్తుండటంతో అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం దెబ్బకు పోలీసులు ఏకంగా వీకెండ్స్ లో వాహనాలను అనుమతించడమే మానేశారు. అలానే సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేసి కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.