పవర్ రీ చార్జ్ : ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ హబ్స్

  • Publish Date - August 30, 2019 / 04:02 AM IST

నగరంలో కరెంటు వాహనాలు పెరిగిపోతున్నాయి. వెహికల్స్ అవసరాలు తీర్చేందుకు త్వరలోనే చార్జింగ్ హబ్స్ రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)తో GHMC ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి వాహనాలన్నీ ఎలక్ట్రానిక్‌వే కావాలని కేంద్ర ప్రభుత్వం..ఇంధన, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రికల్ మొబిలీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. నగరంలో ప్రస్తుతం 1500 ఎలక్రిక్ వాహనాలు తిరుగుతున్నాయని అంచనా. వీటి సంఖ్య రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా..ప్రజలను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం 2022 నాటికి 25 శాతం, 2025 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు తిరగాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే..వాహనాలు చార్జింగ్ చేసుకొనేందుకు తగినన్ని చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఈ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా స్థానిక సంస్థలపై ఉండడంతో జీహెచ్ఎంసీ రెడీ అయ్యింది. సాధారణ చార్జింగ్ సమయం 6 గంటలు..త్వరితంగా చార్జింగ్ కావాలనుకొనే వారికి ఫాస్ట్ చార్జర్లను కూడా హబ్స్‌లో ఉంచుతారు. ఒకసారి చార్జింగ్‌కు రూ. 160 ధరగా నిర్ణయించారు. ఒక్కో యూనిట్‌‌కు డిస్కమ్ ఛార్జి రూ. 6గా ఉంది. చార్జింగ్ హబ్స్ నిర్వహణ, సిబ్బంది వేతనాలు కలిపి వినియోగదారుల నుంచి యూనిట్‌కు సుమారు రూ. 10 వసూలు చేసే అవకాశం ఉంది. అంటే..ఒక్కసారి పూర్తి చార్జింగ్‌కు రూ. 160 ఖర్చవుతుందని అంచనా. 

> ఎలక్ర్టిక్ వాహనాలు ఉపయోగించడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని..స్థానిక సంస్థ జీహెచ్ఎంసీకి చార్జింగ్ ద్వారా వచ్చే వాటాతో పాటు హబ్‌లపై ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. 
> తొలి దశలో 50 ప్రాంతాల్లో..నెల రోజుల్లో కనీసం ఐదు చార్జింగ్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 
> అవసరమైన స్థలాన్ని జీహెచ్ఎంసీ సమకూర్చనుంది. 
> చార్జింగ్ ద్వారా వచ్చే ఫీజులో యూనిట్‌కు 70 పైసలు జీహెచ్ఎంసీకి..ఈఈఎస్ఎల్ చెల్లిస్తుంది. 
> చార్జింగ్ హబ్‌లలో వాహనాలను నిలిపేందుకు తగిన స్థలంతో పాటు..నిరంతర విద్యుత్ సరఫరా, చార్జర్లు కనబడేలా ఏర్పాట్లు చేయనున్నారు.